
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు(Sudheerbabu) కెరీర్ స్ట్రగులింగ్‌లో సాగుతుంది. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్నా ఇంకా హీరోగా నిలబడలేకపోయాడు. సరైనా హిట్లు లేక సవాళ్లతో కెరీర్ రన్ అవుతుంది. సూపర్ స్టార్స్ కృష్ణ, మహేష్(Mahesh) ఫ్యామిలీ హీరో అయినప్పటికీ ఆడియెన్స్ ని తన సినిమాలతో మెప్పించడం వెనకబడి పోతున్నాడు. దీంతో ఇంకా సరైన బ్రేక్ లేక ఒడిదుడుకులతోనే సినీ కెరీర్ సాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన మనసులోని మాటని బయటపెట్టాడు సుధీర్‌బాబు.
బావ Maheshతో కలిసి సినిమా చేసేందుకు తాను సిద్ధమే అని తెలిపారు. ఆయన సినిమాలో విలన్‌గా చేయడానికి తాను సిద్ధమే అని తెలిపారు Sudheerbabu. తన ఇమేజ్‌కి తగ్గ పాత్ర, మహేష్ ఇమేజ్‌కి తగ్గ కథ దొరికితే కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపారు సుధీర్‌బాబు. కెరీర్ పరంగా అప్పుడప్పుడు తన సినిమాల గురించి మామయ్య కృష్ణ, మహేష్‌లతో చర్చిస్తానని తెలిపారు. `ప్రేమ కథా చిత్రమ్` చూశాక తాను హీరోగా తిరుగులేదని, ఇండస్ట్రీలో నిలబడి పోతానని తెలిపారు. వారి మాటలు ధైర్యాన్నిచ్చాయని చెప్పారు. అప్పుడప్పుడు తన సినిమాలను చూసి అభినందిస్తుంటారని చెప్పారు. అయితే తాను మాత్రం స్వతహాగానే ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సూపర్ స్టార్ అభిమానులే కాకుండా, తనని కూడా అభిమానించే వారుండటం సంతోషంగా ఉందన్నారు.
ఇక తన కుమారుల గురించి సుధీర్‌బాబు చెబుతూ, ఇద్దరికి సినిమాలపై ఆసక్తి ఉందని, తన సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో కూడా చెబుతుంటారని తెలిపారు. వారిద్దరు ఇప్పటికే బాలనటులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారని, ఇప్పుడు చిన్నబ్బాయి దర్శన్.. మహేష్ చిత్రంలో బాలనటుడిగా నటిస్తున్నారని చెప్పారు. `సర్కారు వారి పాట` చిత్రంలో మహేష్‌కి చిన్ననాటి పాత్రలో దర్శన్ కనిపిస్తారని తెలిపారు. భవిష్యత్‌లో తన కుమారులు కూడా చిత్ర పరిశ్రమలోకే వస్తారని స్పష్టం చేశారు సుధీర్.
`బాఘి` చిత్రంతో బాలీవుడ్‌లో విలన్‌గా ఆఫర్లు వచ్చాయని, కానీ చేయలేదని తెలిపారు. హీరోగానే తాను రాణించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు సుధీర్‌బాబు. అలాగే పాన్ ఇండియా చిత్రాలపై స్పందిస్తూ, తన అన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యాయని, అక్కడ మన సినిమాలను చాలా చూస్తారని, తెలుగులోనే హీరోగా ఎదిగేందుకు చాలా స్కోప్ ఉందని, బాలీవుడ్‌లో చేయాలనే ఆసక్తి లేదని తెలిపారు. కెరీర్ పరంగా ఎలాంటి అసంతృప్తి లేదని, కాకపోతే పెద్ద హిట్ పడలేదనే బాధ ఉన్నట్టు చెప్పారు. తాను ఐదారు సినిమాలు చేస్తున్నానని, అందులో పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా ఉందని, అది ప్రొడక్షన్ చేతులు మారడం వల్ల ఆలస్యమయ్యిందని చెప్పారు గోపీచంద్.