
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయం వివాదం అవుతోంది. ఎవరెవరో తెలియని విరోధులు తమ ప్రతాపం చూపుతున్నారు. పాత వీడియోలు తవ్వుతున్నారు. ఎప్పుడైనా పొరపాటున నోరు జారితే దాన్ని టైమ్ చూసి బయిటకు లాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి తలనొప్పే రాజమౌళి ఎదుర్కొంటున్నారు. రాజమౌళి, గతంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మీద చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్’ అంటూ అప్పల్లో వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజమౌళి వివరణ ఇచ్చారు. పొరపాటుగా అలా మాట్లాడానే తప్ప, హృతిక్ ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. వివారాల్లోకి వెళితే...
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలవడంతో.. రాజమౌళి ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో తాను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తన మాటల వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు.
అప్పట్లో ప్రభాస్ నటించిన ‘బిల్లా’(Billa) సినిమా ఆడియో ఫంక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ ... “రెండేళ్ల క్రితం ధూమ్ 2 విడుదలైనప్పుడు, బాలీవుడ్ మాత్రమే ఇంత నాణ్యమైన చిత్రాలను ఎందుకు చేయగలదని నేను ఆశ్చర్యపోయాను. హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నాను. ఇప్పుడే బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశాను, ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజమౌళిపై హృతిక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దుమ్మెత్తి పోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.ఈ వీడియో గత కొన్ని రోజుల నుంచి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
తాజాగా దీని గురించి రాజమౌళి మాట్లాడారు ‘‘ఈ వ్యాఖ్యలు నేను చాలా కాలం కిందట చేశాను. 15 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో తెలీదు. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరించాలి. అప్పట్లో ఏదో పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నాను. హృతిక్ రోషన్ ను కించపరిచే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. నేను అతడిని చాలా గౌరవిస్తాను. గతంలో చేసిన కామెంట్లపై కాస్త ఫీలవుతున్నాను” అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు.’’ అని చెప్పారు.
ఇక ఈ మాటలు విన్న నెటిజన్లు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తప్పును అంగీకరించడం మీ గొప్పతనం’‘మరోసారి మీ వినయాన్ని చూపారు’ అంటూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది.