
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `రాజాసాబ్` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొన్నిసాంగ్స్ పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. మిగిలిన షూట్ అంతా అయిపోయిందట.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌తోపాటు మారుతితో కలిసి నిర్మాణంలో భాగమయ్యాడు సోషల్ మీడియా సెన్సేషన్ ఎస్‌కేఎన్. తన బర్త్ డే(జులై 7) సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్ తన గురించి, సినిమాల గురించి, `రాజాసాబ్` గురించి, ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
``రాజా సాబ్` కంటెంట్ పరంగా రొటీన్‌గానే అనిపిస్తుందనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ, మీరు చూసింది టీజరే, ట్రైలర్లు, సినిమా అసలు ముందుంది. ఇది హర్రర్ కామెడీ కాదు, హర్రర్ ఫాంటసీ మూవీ.
ఇలాంటి జోనర్‌లో సినిమా రాలేదు. టీజర్‌కి పాన్ ఇండియా వైజ్ గా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ను ఎలా చూడాలని పదేళ్లుగా ప్రేక్షకులు, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో అలా `రాజా సాబ్`లో చూడబోతున్నారు.
ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ చేస్తున్నాం. డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి వస్తుంది` అని అన్నారు.
సినిమా ట్రెండ్ గురించి చెబుతూ, `రియాల్టీ అనే సైకిల్ లో ఇండస్ట్రీ ఇప్పుడు ఉంది. ప్యాషన్ ఉంటే తప్ప ప్రొడక్షన్ లోకి రావొద్దు. ఇక్కడ పది రూపాయిలు పెడితే ఇరవై వస్తుందని అనుకోవద్దు.
పోతే మొత్తం పోతుంది. వస్తే రెండు మూడు రెట్ల లాభం వస్తుంది. మన కష్టం అంతా ఒక్కరోజులో ఊడ్చిపెట్టుకుపోవచ్చు. నిర్మాతగా ఉండటం అనేది ముళ్లున్న సింహాసనం లాంటిది. ఇక్కడి గ్లామర్ కు ఆకర్షితులై ప్రొడక్షన్ లోకి వస్తే నష్టపోతారు` అని స్పష్టం చేశారు.
ఓటీటీల ట్రెండ్స్ గురించి చెబుతూ, `శాటిలైట్, హిందీ రైట్స్, ఓటీటీ.. ఇలా ఒక్కో టైమ్ లో ఒక్కోటి ప్రొడ్యూసర్స్ కు బాగా పే చేస్తూ వచ్చాయి. ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్ లో బాగా ఆడిన చిత్రాలే లాభాలు తీసుకొచ్చాయి.
ప్రొడ్యూసర్స్ కూడా థియేటర్స్ లో ఆడిన సినిమాలే మనకు మంచివి అని గట్టిగా నమ్మితే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు బాగుంటాయి. హీరో, డైరెక్టర్ క్రేజీ కాంబోలో ఓటీటీ కోసం ఒక మూవీ చేసి అక్కడే మనకు 80 పర్సెంట్ వస్తుందనే ప్రాజెక్ట్స్ కొన్ని ఇటీవల వచ్చాయి.
ఆ బబుల్ కూడా ఇప్పుడు బరస్ట్ అయ్యింది. మళ్లీ మన పాత రూట్స్ లోకి వచ్చి థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలు చేయాల్సి ఉంది.
హిందీ, మలయాళంలో ఓటీటీలకు 8 వీక్స్ టైమ్ పెట్టుకున్నారు. అందుకే మలయాళంలో చిన్న చిత్రాలు కూడా రూ.200 కోట్ల రూపాయల దాకా వసూళ్లు చేస్తున్నాయి. హిందీలో సినిమా బాగుంటే ఆకాశమే హద్దుగా కలెక్షన్స్ వస్తున్నాయి.
తెలుగులో త్వరగా ఓటీటీలకు ఇవ్వడం వల్ల థియేటర్స్ కు వచ్చేందుకు ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు. ఓటీటీలో వస్తుందిలే అనుకుంటున్నారు. థియేట్రికల్ గా ఉన్న టైమ్ కొంతే కాబట్టి ఉన్నంతలో ఆదాయం పొందాలని టికెట్ రేట్స్ పెంచుతున్నాం.
టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉండటం కూడా ఆడియెన్స్ రాకపోవడానికి కారణం. తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఒకట్రెండు సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకుంటే ఓకే గానీ ప్రతి సినిమాకు అలా అవకాశం ఉందని రేట్స్ పెంచడం కరెక్ట్ కాదు.
అందుబాటు ధరల్లో టికెట్స్ ఉంటే మళ్లీ థియేటర్స్ కు ఆడియెన్స్ ను ఆకర్షించవచ్చు. మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రేక్షుకులు టికెట్ రేట్స్, కంటెంట్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. హీరో ఇమేజ్, కంటెంట్ ఈ రెండింటినీ బేస్ చేసుకుని మూవీ బడ్జెట్ పెంచుకోవచ్చు.
అల్లు అర్జున్ నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ముందడుగు వేస్తుంటే, రిస్క్ చేస్తుంటే పడిపోతాననే భయం లేకుండా బన్నీ ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది.
ఏడాదిన్నరలో రెండు చిత్రాలు చేయాలనేది అల్లు అర్జున్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్న అల్లు అరవింద్ గారు నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నా అదృష్టం.
నేను యూవీ క్రియేషన్స్ తో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో, గీతా ఆర్ట్స్ తో, మైత్రీ వాళ్లతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే అందుకు అరవింద్ గారు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సాహమే కారణం. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
హిందీ `బేబి` పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగులో కంటే ఇంటెన్సివ్ గా హిందీ `బేబి` ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ సహా ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
`చెన్నై లవ్ స్టోరీ` సెట్స్ మీద ఉంది. కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ మూవీ పూజా ఈ నెలాఖరులో చేస్తాం. ఈ చిత్రంలో ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్ తో పాటు ఇద్దరు యంగ్ హీరోస్ ఉంటారు.
`హరి హర వీరమల్లు` మూవీకి వర్క్ చేసిన అవినాష్ ను డైరెక్టర్ గా పెట్టి కన్నడ లోని ఓ స్టార్ హీరో, మన తెలుగు నుంచి మిడ్ రేంజ్ హీరో కలిపి ఓ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం.
ఈ రెండు మూవీస్ వెంటనే ప్రారంభిస్తున్నాం. అలాగే `రాజా సాబ్` తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేశ్ తో మరో సినిమా చేయబోతున్నాం. ఆహాలో `త్రీ రోజెస్ సీజన్ 2` వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.