ఆ దొంగను పట్టుకొని సావిత్రికి అప్పజెప్పాను : షావుకారు జానకి

First Published May 9, 2018, 6:58 PM IST
Highlights

సావిత్రిని ఎంతోమంది మోసం చేసారు : షావుకారు జానకి

సావిత్రి .. 'షావుకారు' జానకి కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందువలన వాళ్లిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండేది. తాజా ఇంటర్వ్యూలో  'షావుకారు' జానకి మాట్లాడుతూ .. "చెన్నైలో సావిత్రి ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు ఉండేది. వివిధ రకాల డిజైన్లలో నగలు చేయించుకోవడం సావిత్రికి సరదా. అందువలన తంజావూరు నుంచో .. కుంభకోణం నుంచో 'రంగస్వామి అయ్యంగార్' అనే నగల తయారీదారుడిని జెమినీ గణేశన్ ప్రత్యేకంగా పిలిపించేవారు. ఆ వ్యక్తి మా ఇంట్లోనే ఉంటూ నగలు తయారు చేసేవాడు"

 "సావిత్రితో పాటు నేను కూడా అలాంటి నగలే చేయించుకునేదానిని. సావిత్రి మంచితనం కారణంగా ఆమెను చాలామంది మోసం చేశారు. ఒకసారి నేను చెన్నైలోని ఒక నగల షాపుకి ఏవో వెండి సామాను కొందామని వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి  షాపు అతనికి బంగారు గాజులు అమ్మడం చూశాను .. అవి అచ్చం నా గాజుల మాదిరిగానే వున్నాయి. నేను .. సావిత్రి కలిసి చేయించుకున్నామనే విషయం గుర్తొచ్చి నిలదీశాను. అతను సావిత్రి ఇంటి పనివాడనీ .. దొంగతనం చేశాడని తెలిసింది. ఆ నగలు తిరిగి సావిత్రికి చేరేలా చేయగలిగాను. ఇలా సావిత్రి అజాగ్రత్తను .. మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది మోసం చేశారు" అని చెప్పుకొచ్చారు.       

click me!