తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. హీరోగా, కమెడీ యాక్టర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా విభిన్న పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమకి విశేష సేవలందించారు చంద్రమోహన్. ఆయన ఈ రోజు(శనివారం) హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
*చంద్రమోహన్ ఇకలేరు*
సీనియర్ నటులు, కథా నాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.… pic.twitter.com/OBpaXBdJcJ
— Asianetnews Telugu (@AsianetNewsTL)
చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చంద్రమోహన్ హఠాన్మరణం వార్త తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే చంద్రమోహన్ మరణంపై గతంలోనూ పలు రూమర్లు వచ్చాయి. రెండు మూడు సార్లు ఆయన మరణించారంటూ పుకార్లు రావడంతో స్వయంగా ఆయనే స్పందించి వాటిని ఖండించారు. కానీ ఇప్పుడు ఆయన తిరిగిరాని లోకాలకు వదిలి వెళ్లారు. ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు.
చంద్రమోహన్ 1945, మే 23న కృష్ణాజిల్లాలో పుట్టారు. ఆయన అసలు పేరు మాల్లంపల్లి చంద్రశేఖర రావు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ లో డిగ్రీ చేశారు. నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్న చంద్రమోహన్. 1966లో `రంగుల రాట్నం` చిత్రంతో నటుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. 1968లో `సుఖదుఖాలు` చిత్రంతో బ్రేక్ అందుకున్నారు. ఈ మూవీకిగానూ అవార్డులు అందుకున్నారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్ కి కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
చంద్ర మోహన్ నటుడిగా ఒక మూసకే పరిమితం కాలేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించారు. సీనియర్ నటుడు చంద్రమోహన్‌ది ఐదు దశాబ్దాల సుధీర్ఘ కెరీర్. ఆయన 2017 వరకు సినిమాలు చేశారు. దాదాపు వెయ్యికిపైగా సినిమాల్లో నటించారు. అనేక విలక్షణ పాత్రలు పోషించారు. హీరోగా కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు పోటీనిచ్చారు. ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడిగా మెప్పించారు. అద్భుతమైన నటనతో మెప్పించారు.
చంద్రమోహన్‌కి నటుడిగా బాగా పేరు తెచ్చిన చిత్రాల్లో `రంగుల రాట్నం`, `పదహారేళ్ల వయసు`, `సిరి సిరి మువ్వ`, `నాలై నమదే`, `సీతామహాలక్ష్మి`, `రామ్ రాబర్ట్ రహీమ్`, `రాధా కళ్యాణం`, `రెండు రెళ్లు ఆరు`, `చందమామ రావే` చిత్రాలతో హీరోగా, నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. `చందమామ రావే` చిత్రానికి హీరోగా నంది అవార్డు అందుకున్నారు. `అతనొక్కడే` మూవీకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డు సొంతం చేసుకున్నారు.
హీరోగానే కాదు పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. పలు అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యారు. అలా `జీవన తరంగాలు`, `గంగా మంగా`, `అల్లూరి సీతారామరాజు`, `ప్రాణం ఖరీదు`, `శంకరాభరణం`, `ఇంటి గుట్టు`, `సువర్ణ సుందరి`, `ప్రతిఘటన`, `చంటబ్బాయి`, `ఆఖరి పోరాటం`, `గీతాంజలి`, `బాలచంద్రుడు`, `ఆదిత్య 369`, `నిన్నే పెళ్లాడతా`, `చంద్రలేఖ`, `ప్రేమించుకుందాం రా` వంటి సినిమాలు చేశారు. నేటి తరం హీరోల పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీ, రవితేజ వంటి హీరోలతోనూ సినిమాలు చేశారు. ఇంకా యంగ్ హీరోలతోనూ మూవీస్ చేశారు. ఇలా మూడు తరాల నటులతో కలిసి నటించిన ఘనత చంద్రమోహన్‌కి దక్కుతుంది.