శ్రీదేవి పేరిట రూ.240కోట్ల బీమా పాలసీ..

First Published May 11, 2018, 1:24 PM IST
Highlights

 దుబాయిలో చనిపోతేనే ఆ డబ్బులు కుటుంబసభ్యులకి

అలనాటి అందాల తార శ్రీదేవి మరణంపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ చోటుచేసుకుంది.  ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆమె దుబాయిలోని ఓ హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె మరణంపై స్వతంత్ర విచారణ జరిపించాలంటూ సునీల్ సింగ్ అనే ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు పరిశీలించిన న్యాయస్థానం దానిని తోసి పుచ్చింది. సునీల్‌ సింగ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ కొట్టివేసింది.

అయితే... శ్రీదేవి మరణంపై పిటిషనర్ వేసిన పలు ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీదేవిది ప్రమాదం కాదని, ఆత్మహత్య అనే అనుమానం కలిగేలా పిటిషనర్ పలు వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి పేరిట ఉన్న బీమా పాలసీలు ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే చెల్లింపులు జరుపుతాయని పిటిషనర్‌ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు.

ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ.240 కోట్ల ఇన్సూరెన్స్‌ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వికాస్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. మరోవైపు 5.7 అడుగులు ఉండే వ్యక్తి కేవలం 5.1 అడుగుల బాత్‌టబ్‌లో ఎలా పడిపోతారని  ప్రశ్నించారు. ​శ్రీదేవి మృతికి సంబంధించి దుబాయ్‌ పోలీసులు చేపట్టిన ఆమె వైద్య, దర్యాప్తు పత్రాలన్నింటినీ భారత్‌కు రప్పించాలని, స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని కోరారు.

అనుమానాస్పద పరిస్థితుల్లోనే శ్రీదేవి మరణించారని వికాస్‌ సందేహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతిపై విచారణను కోరుతూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో సునీల్‌ సింగ్‌ మార్చి 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లోని బాత్‌రూమ్‌ టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయి మరణించారని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.

click me!