
విభిన్న పాత్రలు, చిత్రాలు ఎంచుకుంటూ కెరీర్ లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు నటుడు సత్యదేవ్ (Satyadev). ఆయన లేటెస్ట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’. ఈ రొమాంటిక్ డ్రామాను దర్శకుడు నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. వాటికి ఆడియెన్స్ ను మంచి రెస్పాన్సే వచ్చింది. గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. మరోవైపు మూవీ ఆడియోను కూడా సంగీత ప్రియులు ఇష్టపడుతున్నారు. ఇటీవల వరుస అప్డేట్స్ అందిస్తున్న మేకర్స్ తాజాగా మరో క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు.
రెండేండ్ల కింద 2020 ఆగస్టులో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కరోనా పరిస్థితుల కారణంగా కాస్తా ఆలస్యమైంది. అన్నీ కుదిరితే ఉంటే ఈ చిత్రం గతేడాదే రిలీజ్ కావాల్సింది. కుదరకపోవడంతో మేకర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. అదీ కాస్తా వాయిదా పడి చివరిగా ఫైన్ డేట్ ను ఫిక్స్ చేశారు. వచ్చే నెల జూన్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ జూన్ లో పక్కా డేట్ చెప్పలేదు. మరోసారి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ అప్డేట్ తో సత్యదేవ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సత్యదేవ్ లోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేయనున్న ఈ చిత్రం.. శీతాకాలంతో హీరో జీవితానికి ముడిపడి ఉన్న బంధం ఏమిటో తెలియజేయనుంది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సత్యదేవ్ కెరీర్ లో మొదటిసారి ఈ తరహా రోల్ చేస్తున్నారు. తమన్నా(Tamannaah), మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు నాగ శేఖర్ తెరకెక్కిస్తుండగా, భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్నారు. కాలభైరవ గుర్తుందా శీతాకాలం చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే సత్యదేవ్ నటించిన మరో చిత్రం ‘తిమ్మరుసు’ కూడా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం జులై 30న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.