
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దీనితో రెండు వారాల ముందే గ్రాండ్ ప్రమోషన్స్ ప్రారంభించారు. నేడు హైదరాబాద్ లో ఖుషి చిత్ర మ్యూజిక్ కాన్సర్ట్ ని నిర్వహించారు. ఈ వేడుకకి విజయ్ దేవరకొండ, సమంత తో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ లో సమంత ఆకట్టుకునే ప్రసంగం చేసింది. ఈ చిత్రంలో పాటలు విన్నప్పటి నుంచి ఎంతో ఎంజాయ్ చేస్తున్నా. సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సెప్టెంబర్ 1న మీ అందరితో కలసి సినిమా చూడాలనుకుంటున్నా. మీ కోసం మంచి సినిమా తీయాలనేదే నా ప్రయత్నం అని సమంత తెలిపింది.
ఇక తన ఆరోగ్యంపై సమంత పరోక్షంగా కామెంట్స్ చేసింది. నిర్మాతలు ఏడాది పాటు నా పట్ల ఎంతో ఓపిగ్గా ఉన్నారు. నన్ను అర్థం చేసుకున్నారు. వారికీ జీవితాంతం రుణపడి ఉంటాను అని సమంత తెలిపింది. సమంత మయోసైటిస్ కారణంగా కొన్ని నెలల పాటు ఖుషి చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనితో సమంత ఆరోగ్యం కుదుట పడే వరకు ఖుషి టీం ఓపిగ్గా ఎదురుచూసారు.
ఆ విషయాన్నే సామ్ పరోక్షంగా ప్రస్తావించింది. ఇక అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ.. హార్డ్ వర్క్ చేస్తున్నా. తిరిగి ఆరోగ్యంగా వస్తా. మీ అందరి కోసం బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తా అంటూ కామెంట్స్ చేసింది. సమంత పూర్తిగా కోలుకునేందుకు ప్రస్తుతం షూటింగ్స్ నుంచి ఏడాది బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి నటీనటులకు కృతజ్ఞతలు తెలిపింది. ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ లో సమంత రెడ్ శారీ లో బ్యూటిఫుల్ గా మెరిసింది.
ఇక నిర్మాతలు మాట్లాడుతూ సమంత తమ బ్యానర్ లో చేసిన జనతా గ్యారేజ్, రంగస్థలం, స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అని అన్నారు. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.