
అనూహ్యంగా సలార్ టీజర్ ని తెల్లవారుజామున విడుదల చేశారు. సాధారణంగా సినిమా ప్రోమోలు ఉదయం 10 తర్వాత సాయంత్రం 7 గంటలకు ముందు విడుదల చేస్తారు. జనాలు యాక్టీవ్ ఉండే సమయం కావడంతో బాగా రీచ్ అవుతుందని భావిస్తారు. సలార్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. సలార్ టీజర్ ఉదయం 5:12 నిమిషాలకు విడుదల చేయడానికి ప్రత్యేక కారణం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ విషయం పక్కన పెడితే... వేళకాని వేళలో విడుదల చేసినా సలార్ టీజర్ రికార్డు వ్యూస్ రాబట్టింది. ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. 24 గంటల్లో సలార్ టీజర్ 83 మిలియన్ వ్యూస్ రాబట్టింది. గత రికార్డుకి ఇది ఎక్కడో అందనంత ఎత్తులో ఉంది. సలార్ తర్వాత స్థానం ఆదిపురుష్ టీజర్ కి దక్కింది. 68.9 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానంలో ఉంది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ 68.83 మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో రాధే శ్యామ్ టీజర్ ఉంది.
టాప్ ఫోర్ లో మూడు చిత్రాలు ప్రభాస్ వే కావడం గమనించాల్సిన విషయం. కాగా సలార్ టీజర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బీభత్సం సృష్టించింది. కెజిఎఫ్ 2 టీజర్ తో పోల్చితే సలార్ టీజర్ తేలిపోయిందని, అంతగా ఆకట్టుకోలేదన్న వాదన వినిపించింది. డిస్సపాయింటెడ్ అంటూ ఓ నెగిటివ్ టాగ్ కూడా ట్రెండ్ అయ్యింది.
ఇక సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. కెజిఎఫ్ నిర్మాతలైన హోమ్బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది.