
సాయిపల్లవి హీరోయిన్లలో ఎవరికీలేని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. లేడీ పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్‌ని పొందింది. అద్భుతమైన డాన్సులతో, నటనతో కట్టిపడేసే సాయిపల్లవి విప్లవ నాయకురాలిగా మారింది. `విరాటపర్వం` చిత్రంలో ఆమె అభ్యూదయభావాలు కలిగి, నక్సల్స్ భావాలకు ఆకర్షితురాలైన వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటించింది. రానా హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు.
`విరాటపర్వం` చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూచేశారు. విజయవాడలో జరిగిన మీడియా మీట్‌లో సాయిపల్లవి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గన్ పట్టుకోవడం, ఫైరింగ్ చేయడంపై స్పందించారు. ఈ సినిమాలో తను పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తెలిపింది సాయిపల్లవి. తుపాకీ పట్టడం ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది. గన్‌తో ఫైరింగ్, ఫైట్స్ చేయడం చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అని పేర్కొంది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల గురించి చెబుతూ, తాను ఏ సినిమా చేసినా తన పాత్రకి ప్రధాన్యత ఉండేలా చూసుకుంటానని, కథలో ప్రయారిటీ ఉండాలని, తన పాత్రతో మంచి కథ చెప్పేలా ఉండాలని, అది ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలని చూసుకుంటానని తెలిపింది. ఈ చిత్రంలో పాటలు కథలో భాగంగా వస్తాయని తెలిపింది. తాను కూడా అలాంటి పాటలనే కోరుకుంటానని తెలిపారు. ఇందులోనూ డాన్సులుంటాయని పేర్కొంది సాయిపల్లవి.
రానా గురించి చెబుతూ, రానా చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని. మొన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లో వర్షంలో తను గొడుగు పట్టుకోవడంచూస్తే మీకు అర్థమవుతుందన్నారు. తన రియల్ క్యారెక్టర్ అలాంటిదని, హీరో, ఇమేజ్‌ని ఆయన ఎప్పుడూ పట్టించుకోరని తెలిపారు. సెట్ లో కూడా తనకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారని, తను సేఫ్‌గా వెళ్లేంత వరకు కేర్ తీసుకుంటారని తెలిపారు. ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు సాయిపల్లవి.
రానా ఈ ఈవెంట్ మాట్లాడుతూ, `విరాట పర్వం` అందమైన ప్రేమ కథా చిత్రమని తెలిపారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ సినిమాలో తాను రవన్న పాత్రలో కనిపిస్తానని,మంచి కథ ఉంటే మల్టీ స్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమేనని రానా స్పష్టం చేశారు. తన తాత దగ్గుబాటి రామానాయుడు జన్మదినం రోజున విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ చుండూరి మాట్లాడుతూ.. 1990లో జరిగిన ఓ యువతి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.