`సారంగ దరియా` తెచ్చిన హైప్‌.. `లవ్‌స్టోరీ` మూడు భాషల్లో రిలీజ్‌!

By Aithagoni RajuFirst Published Apr 2, 2021, 6:01 PM IST
Highlights

`లవ్‌స్టోరి` సినిమాకి వచ్చిన హైప్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా తరహాలో విడుదలకు ప్లాన్‌ చేస్తుంది చిత్ర యూనిట్‌. తెలుగుతోపాటు కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లవ్‌స్టోరి`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. అయితే సినిమాకి `సారంగ దరియా` పాటతో విపరీతమైన హైప్‌ వచ్చింది. ఈ పాట కేవలం 32 రోజుల్లో వంద మిలియన్‌ వ్యూస్‌ని రాబట్టుకుంది. ఓ జానపద పాట సినిమా పాటగా మారి ఈ రేంజ్‌లో వ్యూస్‌ని రాబట్టుకోవడం సౌత్‌లోనే ఇదే ఫస్ట్ టైమ్‌. దీంతో ఈ పాట లిరికల్‌ సాంగ్‌ విభాగంలో అత్యంత వేగంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని సాధించిన పాటగా నిలిచింది. 

We would like to announce simultaneous release of in Kanada Malayalam and Telugu in theatres on April 16th pic.twitter.com/8rZviu9hSO

— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP)

ఈ నేపథ్యంలో సినిమాకి వచ్చిన హైప్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా తరహాలో విడుదలకు ప్లాన్‌ చేస్తుంది చిత్ర యూనిట్‌. తెలుగుతోపాటు కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ, `రెండు, మూడేళ్ల క్రితమే `సారంగ దరియా` పాట విన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఈ పాటను సినిమాలో పెట్టుకోవాలి అనుకున్నాను. సందర్భం, సీన్ కుదరడం వల్ల `లవ్ స్టోరి` చిత్రంలో ఈ పాటను తీసుకున్నాను. 

ఈ పాట విజయం ఊహించిందే, అయితే ఇంత భారీ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. లిరికల్ వీడియోనే 100 మిలియన్ వ్యూస్ సాధిస్తుందని అనుకోలేదు. మా టీమ్ అంతా ఉద్వేగంగా ఉన్నాము. సినిమా ఎప్పుడు చూద్దామా, పాట ఎలా ఉంటుంది అనేది చూసేందుకు ఎదురుచూస్తున్నారు. మెయిన్ క్రెడిట్ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి ఇవ్వాలి. జానపద గీతాన్ని తీసుకుని తనదైన ముద్రతో అద్భుతంగా ఈ పాట రాశారు. ఇంత విజయానికి కారణం అయ్యారు. 'చురియా చురియా చురియా ఇది చిక్కీ చిక్కని చిడియా' లాంటి ఎన్నో కొత్త పద ప్రయోగాలు చేశారు. ఇది యూట్యూబ్ లో ఇప్పటికే ఉన్నా, ఇంతగా శ్రోతలకు నచ్చిందంటే మీ సాహిత్యం వల్లే సాధ్యమైంది.

 సంగీత దర్శకుడు పవన్ తనకు ఇది తొలి సినిమా అయినా, ఫోక్ ను అర్థం చేసుకుని, ట్యూన్ ను డెవలప్ చేసి పాట చేశారు. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది. అన్ని పాటలు మ్యూజికల్ హిట్స్ చేసిన పవన్ కు థాంక్స్. గాయని మంగ్లీ తనదైన శైలిలో పాడి పాటకు ఆకర్షణ తీసుకొచ్చింది. సాయి పల్లవి డాన్స్ ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ అద్భుతంగా స్టెప్స్ చేయించారు. ఈ లిరికల్ వీడియోకు వచ్చిన దానికంటే పది రెట్లు సినిమాలో వీడియో సాంగ్ కు వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. 

`ఫిదా` సినిమాలో 'వచ్చిండె...' పాట సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయింది. కానీ 'సారంగ దరియా' పాటకు లిరికల్ వీడియోకే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట విజయం సినిమా మీద మరింత అంచనాలు పెంచింది. సినిమా ఎప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ తో పాటు నేనూ వేచి చూస్తున్నాను. పాటలన్నీ హిట్ అయి ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరి అని నేను చెప్పిన మాటను నిజం చేశాయి.  ఏప్రిల్ 16న లవ్ స్టోరి విడుదలవుతుంది. మీ అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నా` అని అన్నారు.

click me!