
`భూమి శాశ్వతం అని, భూమిపై మనం అందరం అతిథులమే అని యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) అన్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) టీమ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తారక్‌తోపాటు రాజమౌళి(Rajamouli), రామ్‌చరణ్(Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సారథ్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్ఆర్` సినిమా ఈ నెల 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నాం. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు. `బాహుబలి` టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాజమౌళి.
ఎన్టీఆర్ చెబుతూ, దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు తారక్. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంట్లో పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలని కోరారు.
రామ్ చరణ్ స్పందిస్తూ, తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని హీరో రామ్ చరణ్ అన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ ను `ట్రిపుల్ ఆర్` టీమ్ అభినందించింది.
సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని, సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్ లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.