సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని బెంగాలీ పాపులర్ హీరోయిన్ రితాభరి చక్రవర్తి...
మలయాళీ సినీ పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది నటిమణులు బయిటకు వచ్చి ధైర్యంగా తమ జీవితాల్లో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇతర సినిమా పరిశ్రమల్లోని మహిళా నటులు సైతం లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలతో మొదలై విమర్శలు, ఖండనలు, రాజీనామాలను దాటి వ్యవహారం కేసుల దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇతర భాషా నటీమణులు సైతం ‘మీటూ’ అంటూ ముందుకొచ్చారు.
తాజాగా బెంగాలీ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని బెంగాలీ పాపులర్ హీరోయిన్ రితాభరి చక్రవర్తి డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సినీ పరిశ్రమలోని పలువురు నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి మహిళా నటులకు వేధింపులు ఎదురవుతున్నాయని రితాభరి చెప్పుకొచ్చింది. బెంగాళీ ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అలాగే ఇండస్ట్రీలో వేధింపులకు పాల్పడే నిందితుల్లో చాలా మంది కోల్ కతాలోని ఆర్ జి కర్ ఆస్పత్రి డాక్టర్ హత్యాచార వ్యతిరేక నిరసనల్లో సిగ్గులేకుండా పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంతకీ నటి రితాభరి ఆ పోస్టులో ఏం రాసిందంటే.?
"మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. బెంగాలీ పరిశ్రమలోనూ ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నన్ను ఆలోచిపంజేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో చాలా నివేదికలు నాకు ఎదురైన అనుభవాల మాదిరిగానే ఉన్నాయి. నాకు తెలిసిన ఇలాంటి కీచక నటులు, నిర్మాతలు, దర్శకులు ఆర్ జి కర్ బాధితురాలి కోసం కొవ్వొత్తులను పట్టుకుని నిస్సిగ్గుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ఈ మానవ మృగాల ముసులు విప్పాల్సిన సమయం వచ్చింది. ఈ రాక్షసులకు వ్యతిరేకంగా గళం విప్పాలని తోటి నటులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ మగాళ్లలో చాలా మంది ఇండస్ట్రీని ప్రభావితం చేసే వాళ్లే ఉన్నారు. వారి గురించి మాట్లాడితే అవకాశాలు కోల్పోతామని భావించకూడదు. ఇంకా ఎంత కాలం నిశ్శబ్దంగా ఉందాం? ఎన్నో కలలు కంటూ యువ నటీమణులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, ఇది షుగర్ కోటెడ్ వ్యభిచార గృహం తప్ప మరొకటి కాదని నమ్ముతున్నా. సీఎం మమతా బెనర్జీ కూడా హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి” అని కోరింది.
నటి రితాభరి మమతా నటించిన బెంగాలీ చిత్రాల విషయానికి వస్తే.. 'ఛోతుష్‌కోన్' (2014), 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కోల్‌కతా' (2014), 'బవాల్' (2015), 'ఫటాఫతి' (2022) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.