
రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) అంటేనే సంచలనం. వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే వర్మ(Varma) ఆడియెన్స్ పై, ఓటర్లపై సెటైర్లు పేల్చారు. వారిని జడ్జ్ చేయడం పెద్ద ముర్ఖత్వం అని తెలిపారు. తానెప్పుడూ ఆడియెన్స్ ని జడ్జ్ చేయనని, తనకు నచ్చిన సినిమాలు తీస్తానని, నచ్చినట్టు తీస్తానని, ఇష్టమైతే చూడండి లేకపోతే మానేయండి అని అన్నారు. `కొండా` (Konda) సినిమా విషయంలోనూ తనకు ఏం తీయాలనిపిస్తే అదే తీశానని, కొండా మురళీ, కొండా సురేఖల ఒత్తిడి తనపై ఏమాత్రం లేదని తెలిపారు.
RGV రూపొందించిన లేటెస్ట్ మూవీ `కొండా`. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. కొండా మురళీ, కొండా సురేఖల జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. వాళ్ల కాలేజ్ డేస్ నుంచి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మధ్య ఏం జరిగిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మురళీ పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. ఈ నెల(జూన్) 23న సినిమా విడుదల కానుంది.
చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రామ్‌గోపాల్ వర్మ `కొండా` చిత్రం గురించి, తన సినిమాల గురించి, టికెట్ల రేట్ల ఇష్యూ గురించి మాట్లాడారు. `నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు. ఎన్నికల సమయంలో సురేఖ గారి ఇంటర్వ్యూలు అవీ చూశా. ఆమె గుర్తు ఉన్నారు. కానీ, కొండా మురళి పేరు గుర్తు లేదు. పోలీస్ చెప్పిన తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కొండా దంపతుల జీవితంలో ట్విస్టులు ఉన్నాయి. డ్రామా ఉంది. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొండా ఫ్యామిలీని కలిశా. అందరినీ కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాని చెప్పా. తమ జీవితానికి దగ్గరగా ఉందని అనుకున్నారు. నిర్మించేందుకు ముందుకొచ్చారు` అని తెలిపారు.
కొండా మురళి, సురేఖ కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు, 1990 నుంచి 2000 వరకు వారి జీవితంలో జరిగిన విషయాలను చూపించారు. అయితే ఈ కథలో వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. నాకు నిజం అనిపించిన పాయింట్స్ చెప్పా. నేనూ ఇతరుల నుంచి తెలుసుకున్న సమాచారంలో నమ్మినవి చెప్పాను. క్రైమ్ వెనుక కారణం ఏమిటి? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వంటి అంశాలను ఎలా చూపించాను అనేది 'కొండా'లో చూడాలి. సినిమాని నిర్మించారు కదా అని కొండా ఫ్యామిలీ చెప్పినట్టు నేను తీయలేదు. నాకు నచ్చినట్టు సినిమా తీశా` అని తెలిపారు వర్మ. సినిమాలో గద్దర్‌తో కలిసి `పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలామా.. `అనే పాటని పాడాను. అది చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు వర్మ.
టికెట్ రేట్ల పెంచడం, తగ్గించడంపై స్పందిస్తూ, పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవని తెలిపారు. `మనం చేసేది మనం చేస్తాం. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. అదొక సైకిల్. నాలుగు నెలల క్రితం టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్ళీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడం అంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు` అని అన్నారు.
ఇటీవల కాలంలో మీలో చాలా మార్పు వచ్చినట్టుందన్న ప్రశ్నకి వర్మ స్పందిస్తూ, తాను మారలేదని, టికెట్ల ఇష్యూపై తాను మాట్లాడింది, ఏపీ ప్రభుత్వంపై చర్చలు జరిపింది కూడా తన సొంత లాభం కోసమే అని, అందులో సిన్సియారిటీ ఉందని మీరు అనుకుంటున్నారని, తన ప్రయోజనం ఏంటో తనకు తెలుసు అని తెలిపారు. తాను మారలేదని, తాను ఎప్పుడు తనలాగే ఉంటానని తెలిపారు.
కమర్షియల్ సినిమాలపై స్పందిస్తూ, సినిమా థియేటర్లలో ఆడి డబ్బులు వసూలు చేస్తే కమర్షియల్ సినిమా అని చెప్పారు. త్వరలో అమితాబ్ బచ్చన్‌తో ఓ హర్రర్ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. అది నవంబర్ లో స్టార్ట్ కావచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన దానిపై స్పందిస్తూ, అప్పుడప్పుడు హైప్ కోసం అలా ప్రకటనలు చేస్తానని, తన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు.