
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రాక్షసుడు'. 'జయ జానకి నాయక' సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని రీమేక్ కథను నమ్ముకున్నాడు. తమిళంలో సక్సెస్ అందుకున్న 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'రాక్షసుడు' సినిమాలో నటించాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ కి మాత్రం ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది. ఒకట్రెండు సార్లు వాయిదా వేసుకున్న తరువాత ఆగస్ట్ 2న సోలోగా రావాలనుకుంటే అదే సమయానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో మళ్లీ 'రాక్షసుడు' వెనక్కి వెళ్తుందేమో అనుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్నట్లుగా ఆగస్ట్ 2న రావడానికి సిద్ధమైంది.
ఈ సందర్భంగా.. హవీష్ కోనేరు మాట్లాడుతూ.. ''తమిళంలో సూపర్‌డూపర్‌హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని రమేష్‌వర్మగారు డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్ లో కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నాం'' అన్నారు.