Rajamouli: ఆస్కార్ కి అధికారిక ఎంట్రీ దక్కనందుకు బాధపడ్డాను

By Sambi ReddyFirst Published Jan 20, 2023, 3:39 PM IST
Highlights


భారత్ తరపున ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కలేదు. గుజరాతీ చిత్రం చల్లో షో ఈ గౌరవం దక్కించుకుంది. దీని వెనుక రాజకీయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తగా రాజమౌళి స్పందించారు. 
 

ప్రతి ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ నామినేషన్స్ కి ఓ చిత్రాన్ని ఎంపిక చేసి పంపుతుంది. 2022లో విడుదలైన చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ కి ఆ అవకాశం దక్కుతుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. అనూహ్యంగా గుజరాతీ చిత్రం చల్లో షో(ది లాస్ట్ ఫిల్మ్ షో)కి అర్హత లభించింది. జ్యూరీ సభ్యులు ఆర్ ఆర్ ఆర్ ని కాదని ఆ చిత్రాన్ని ఎంపిక చేశారు. జ్యూరీ సభ్యుల నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ కేవలం ఓ కమర్షియల్ మూవీ, అలాంటి చిత్రాలకు ఆస్కార్ నామినేషన్స్ దక్కవంటూ కొందరు సభ్యుల నిర్ణయాన్ని సమర్ధించారు. 

చల్లో షో ఎంపిక విషయంలో రాజకీయ ప్రమేయం ఉందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఆస్కార్ బరిలో నిలవాలని భావించారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అన్వేషించారు. లాస్ ఏంజెల్స్ నగరంలో రెండు వారాలకు పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించబడిన ఏ చిత్రమైనా ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా దాదాపు 15 విభాగాల్లో జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కోసం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ అప్లై చేశారు. 

కాగా భారత్ నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కకపోవడంపై రాజమౌళి స్పందించారు. ఆ విషయం చాలా బాధించిందని ఆయన అన్నారు. విదేశీయులు కూడా ఆర్ ఆర్ ఆర్ భారత్ నుండి అధికారికంగా ఆస్కార్ నామినేషన్స్ కి పంపబడితే బాగుండేదన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారని రాజమౌళి తెలియజేశారు. అలా అని మేము బాధపడుతూ కూర్చోలేదు. చల్లో షో మూవీ ఎంపికైంది. అందుకు మేము ఆనందించాము. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు? అనేది నాకు తెలియదు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ కి ఎందుకు అధికారిక ఎంట్రీ దక్కలేదని నేను మాట్లాడను... అని ఆయన చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ అయ్యింది. త్వరలో నామినేషన్స్ ప్రకటించనున్నారు. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ అనేక అంతర్జాతీయ అవార్డులు, గౌరవాలు అందుకుంది. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ కి ఎంపికైంది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని విజేత అయితే... అది ఇండియా సినిమా సాధించిన అతి పెద్ద గౌరవం అవుతుంది. 
 

click me!