రాజకీయాలలోకి వస్తున్నానంటూ లారెన్స్ సంచలన ప్రకటన

By Satish ReddyFirst Published Sep 5, 2020, 12:31 PM IST
Highlights

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయాలలోకి వస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందల మందికి సహాయం చేసిన తాను, రాజకీయక నాయకుడిగా మరింత మందికి సాయం చేయగలని నమ్ముతున్నట్లు తెలియజేశారు. 
 

బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవా లారెన్స్ సంచలన ప్రకటన చేశారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సేవకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాఘవ చెప్పారు. ఏళ్లుగా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సాయం చేస్తున్నాను అన్నారు. మరింత సాయం చేయాలన్నా, ఇంకా ఎక్కువ మందికి నా సేవలు చేరాలన్నా రాజకీయాలలోకి రావడమే సరైన మార్గం అని నమ్ముతున్నట్లు చెప్పారు. గతంలో తాను ప్రజా సేవ చేయడానికి రాజకీయాలలోకి రావలసిన అవసరం లేదని అన్నానని, కానీ నా సన్నిహితులు, మితృలు రాజకీయ నాయకుడిగా మారాల్సిన అవశ్యకత తెలియజేశారు అన్నారు. 

ఇక తన సేవా కార్యక్రమాలకు గతంలో అనేక మంది రాజకీయ నాయకులు సాయం చేశారు అన్నారు. జయలలిత, కరుణానిధి వంటి వారు తమ వంతు సాయం అందించి ట్రస్ట్ ద్వారా సేవలు అందించడానికి దోహదం చేశారు. ఐతే రాజకీయాలలోకి రావడం వలన వ్యక్తి గత దూషణ చేయాల్సి వస్తుందని, దానికి తాను విరుద్ధం అన్నారు. వ్యక్తులను టార్గెట్ చేసి విమర్శలు చేయడం నేను ఎప్పటికీ చేయను అన్నారు. 

అందుకే తలైవా రజనీకాంత్ తో పాటు రాజకీయాలలో కొనసాగుతా అన్నారు. ఆయన సారథ్యంలో రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో పాల్గొంటాను అన్నారు. ఇక రజినీ కాంత్ ప్రారంభించనున్న పార్టీలో చేరనున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయని రాజకీయ పార్టీ స్థాపించాలి అంటే అది కేవలం తన గురువు గారైన తలైవా రజనీ కాంత్ వలనే సాధ్యం అని చెప్పారు. ఇక తన రాజకీయ అరంగేట్రం నవంబర్ లో ఉంటుందని, అప్పుడే రజనీ తన నూతన పార్టీ ప్రకటన చేస్తారని పరోక్షంగా లారెన్స్ హింట్ ఇచ్చారు. లారెన్స్ తాజా ప్రకటన తమిళ మీడియాలో ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. 

click me!