
పుష్ప (Pushpa)మూవీతో అల్లు అర్జున్ ఇమేజ్ మరో మెట్టుకి ఎదిగింది. ముఖ్యంగా హిందీలో పుష్ప విజయం సాధించడం చాలా ప్లస్ అయ్యింది.పుష్ప హిందీ వర్షన్ ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ నేమ్ మారుమ్రోగింది. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం, డైలాగ్స్ పిచ్చ పాప్యులర్ అయ్యాయి. ఊహకు మించిన సక్సెస్ అందుకోగా అల్లు అర్జున్ తో పాటు పుష్ప టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 'పుష్ప' ఘన విజయం సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ (Allu Arjun)మామగారు చంద్రశేఖర్ రెడ్డి (భార్య స్నేహారెడ్డి తండ్రి) హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిరంజీవి(Chiranjeevi), ఆయన భార్య సురేఖ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అల్లుడు బన్నీని చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ పార్టీకి అల్లు అరవింద్ దంపతులు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, క్రిష్ జాగర్లమూడి, గుణశేఖర్ తదితరులు హాజరైనట్లు సమాచారం.
మొదటిసారి చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు అల్లు అర్జున్ సినిమాలపై స్పందించడం విశేషం.గతంలో అల్లు అర్జున్ సినిమా వేడుకలలో కూడా చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్న దాఖలాలు లేవు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. దీంతో ఆయన ఈ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం కాగా... చంద్రశేఖర్ రెడ్డి మొదట్లో ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. స్వయంగా అల్లు అరవింద్ పిల్లనివ్వాలని సంబంధం మాట్లాడడానికి వెళ్లినా పని కాలేదు.
అయితే స్నేహారెడ్డి పట్టుబట్టడంతో చేసేది లేక అల్లు అర్జున్ ని అల్లుడిగా స్వీకరించారు. ఇక అల్లు అర్జున్ భార్య పిల్లలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. 11ఏళ్ల వైవాహిక జీవితంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఆదర్శ దంపతులుగా మెలుగుతున్నారు. ఇక త్వరలో పుష్ప 2 షూట్ మొదలుకానుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే మూవీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన మూవీ సందిగ్ధంలో పడింది.