సినీ పరిశ్రమలో ఒక హీరోకి అనుకుని రాసుకున్న కథ మరో హీరోతో తెరకెక్కడం సర్వ సాధారణం. అటువంటి సంఘటనలు ఎప్పటినుంచో వింటున్నవే. తాజాగా అటువంటి సంఘటన ఒకటి పునరావృతం అయ్యిందని సమాచారం.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ "జనగణమన". దీన్ని పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తానని చాలా ఏళ్ల క్రితం ప్రకటించాడాయన. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూనే వస్తోంది. ఇక ఈ చిత్రం స్క్రిప్ట్ ని సూపర్ స్టార్ మహేశ్‌బాబు కోసం రాసానని, ఆయనతో తీస్తున్నట్లు వెల్లడించాడు పూరీ. కానీ అకస్మాత్తుగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అంతేకాదు, భవిష్యత్తులోనూ మహేశ్‌తో సినిమాలు చేయనని పూరీ ప్రకటించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు అటకఎక్కేసినట్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ దాన్ని బయిటకు తీసారట.
అయితే ఇప్పుడా క్రేజీ ప్రాజెక్టులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ భాగం కాబోతున్నారనే రూమర్స్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ లైన్ విన్న పవన్ పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని పూరీకి చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ బాక్సాఫీసు హిట్లుగా నిలిచాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ పవన్‌తో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కనుక పూరీ చేస్తే ఎక్సపెక్టేషన్స్ భారీగానే ఉంటాయి.
ఒక వేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌తో పాటు బాక్సాఫీసుకు పండగే రీసెంట్ గా పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’ సినిమా రిలీజయ్యి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఓటీటీలోనూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. మరో పక్క రానాతో కలిసి మలయాళీ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’తెలుగు రీమేక్ పనిలో ఉన్నారు. అలాగే పూరీ విజయ్‌దేవరకొండతో ‘లైగర్’ అంటూ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నారు.
ఇక పూరీ జగన్నాథ్‌కు గతేడాది రామ్‌తో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగ లేదు. ఈ హిట్‌తో బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చినా కూడా పూరీకి ఒరిగింది మాత్రం లేదు. పూరీ జగన్నాథ్ మాత్రం మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు చేస్తా అని చెబుతున్నాడు. కానీ ఆయా హీరోలు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. దాంతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాను తెరకెక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోవడమే తన డ్రీమ్ అంటున్నాడు.