అధికార లాంఛనాలతో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలుః కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై

By Aithagoni RajuFirst Published Oct 29, 2021, 4:04 PM IST
Highlights

అభిమానులు, ప్రేక్షకులు, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పునీత్‌ మరణ వార్త విని షాక్‌కి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 
 

కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం యావత్‌ సౌత్‌ చిత్ర పరిశ్రమని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. అభిమానులు, ప్రేక్షకులు, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పునీత్‌ మరణ వార్త విని షాక్‌కి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

పునీత్‌ని కాపాడుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినట్టు చెప్పారు. వైద్యులు తీవ్రంగా శ్రమించారని ఆయన తెలిపారు. కేవలం 46ఏళ్ల వయసులో ఈ స్థాయిలో స్ట్రోక్‌ రావడం బాధాకరమన్నారు. హార్ట్ స్ట్రోక్‌ తీవ్రంగా రావడంతో ఆయన్ని కాపాడటం వైద్యుల వల్ల కాలేదని తెలిపారు. నిన్న(గురువారం)నే తనతో పునీత్‌ ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. తన వెబ్‌ సైట్‌ ఓపెనింగ్‌కి రావాలని తనని ఆహ్వానించినట్టు సీఎం తెలిపారు. ఆ మధ్య తన `భజరంగీ` సినిమా ఫంక్షన్‌లోనూ బాగా డాన్స్‌ చేశారని, చాలా హెల్దీగా, ఫిట్‌గా ఉండే ఆయనకు హార్ట్ స్ట్రోక్‌ రావడం బాధాకరమని, ఆయన మరణం  తమ చిత్ర పరిశ్రమకి తీరని లోటని తెలిపారు. యూత్‌కి, ముఖ్యంగా అభిమానులకు ఆయన కంటిపాపలాంటివారని తెలిపారు. 

ప్రస్తుతం పునీత్‌ రాజ్‌కుమార్‌ భౌతిక కాయాన్ని బెంగుళూరులోని సదాశివ్‌నగర్‌లో గల పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంటికి తరలించారు. అక్కడ బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి తరలించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు వందితా రాజ్‌కుమార్‌ అమెరికాలో ఉన్నారు. ఆమె ఇండియాకి వచ్చాక రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. పునీత్‌కి ఇద్దరు కూతుళ్లు, భార్య అశ్వినీ రేవంత్‌ ఉన్నారు.

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. అప్పుగా, పవర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు పునీత్‌రాజ్‌కుమార్‌. బాలనటుడుగా దాదాపు 13 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. అంతేకాదు బాలనటుడిగా అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు. దీంతోపాటు హీరోగానూ అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గానూ నిలిచారు. ఆయన నటుడిగా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా, సింగర్‌గా రాణిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌కి తెలుగు సినిమాలకి, తెలుగు ఫిల్మ్ మేకర్స్ తో విడదీయలేని బంధం ఉంది. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం `అప్పు` తెలుగులో వచ్చిన `ఇడియట్‌`కి రీమేక్‌ కావడం విశేషమైతే, దీనికి కూడా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించడం మరో విశేషం. అంతేకాదు ఆయన సినిమాలో ఎన్టీఆర్‌ పాటపాడారు, ఆయన సినిమాలో రవితేజ గెస్ట్ గానూ నటించారు.

click me!