
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు నిర్మాతలు దిల్ రాజు, తమ్ముడు శిరీష్ రెడ్డిలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. `గేమ్ ఛేంజర్` పరాజయం అయ్యిందంటూ పదే పదే కామెంట్లు చేస్తున్నారు. ఆ మూవీ డిజాస్టర్ అంటూ అటు హీరోని, దర్శకుడిని చులకన చేసి మాట్లాడుతున్నారు.
అంతేకాదు సినిమా ఫ్లాప్ అయితే కనీసం హీరో రామ్ చరణ్ ఫోన్ చేసింది లేదని, తమకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని నిర్మాత శిరీష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. అయితే ఆ వీడియో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. పెద్ద రచ్చ చేశారు.
దిల్ రాజు, శిరీష్‌లకు వార్నింగ్ ఇస్తూ లెటర్ విడుదల చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. చరణ్ ఫ్యాన్స్ కి ఆయన క్షమాపణలు చెప్పారు.
`నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో ద్వారా అపార్థాలకు దారి తీసి, దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్టు తెలిసింది. `గేమ్ ఛేంజర్` సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయిన ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి` అని పేర్కొన్నారు శిరీష్ రెడ్డి.
అంతకుముందు శిరీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకుగానూ మెగా అభిమానులు స్పందిస్తూ నోట్ విడుదల చేశారు. ఇందులో `సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికి తెలుసు.
మీ ప్రొడక్షన్ హౌస్‌లో మీరు చేసే సినిమాలు మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకునే మీరు, ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాధించడం ఎంత వరకు సమంజసం. `వన్ నేనొక్కడినే` టైమ్‌లో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా?, మైత్రీ బ్యానర్‌లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి మాట్లాడారా?
`సైంధవ్` ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా హిట్ అయితే వెంకటేష్ కి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా? ఎక్కువ ఏమైనా ఇచ్చారా?` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు చరణ్ ఫ్యాన్స్.
అంతేకాదు `దర్శకుడు శంకర్ ఉన్నాడు అని రామ్ చరణ్ వద్దకు వెళ్లింది ఎవరు? ఒక్క ఏడాది అంటూ మూడేళ్లు వృథా చేసింది ఎవరు? `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా? మా అభిమానులు మూడేళ్లుగా ఒక సినిమా కోసం ఎదురుచూసి అది కూడా ఫ్లాప్ అయ్యిందని మానసిక క్షోభతో ఉన్నారు.
మీరు మాత్రం ప్రతి రోజూ ఇదే విషయం మీద మాట్లాడుతూ, హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి పెస్ మీట్ లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు.
ఇదే చివరి హెచ్చరిక, ఇంకోసారి `గేమ్ ఛేంజర్` సినిమా గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుంది ఖబర్దార్` అంటూ వార్నింగ్ నోట్‌ని విడుదల చేశారు. దీనికి తాజాగా నిర్మాత శిరీష్ స్పందిస్తూ సారీ చెప్పారు.
మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా నష్టనివారణ చర్యలు చేపట్టారు. `గేమ్ ఛేంజర్` మూవీ కోసం రామ్ చరణ్ తనకు ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. శంకర్ `ఇండియన్ 2` కోసం వెళ్లినా, మా మూవీ కోసం వెయిట్ చేశారని, మరో సినిమా ఆఫర్ ఉన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారని, ఈ మూవీ పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందించారని తెలిపారు.
ఈ మూవీ విషయంలో ప్రారంభం నుంచి రామ్ చరణ్‌తో ట్రావెల్ అవుతున్నా అని, ప్రతిదీ చర్చించామని, తమ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందన్నారు. ఈ మూవీ కోసం తన విలువైన సమయాన్ని వదులుకున్నారని తెలిపారు దిల్‌రాజు.
వీరు నిర్మించిన `తమ్ముడు` సినిమా జులై 4న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే ఈ వివాదం ప్రారంభమైంది. `తమ్ముడు`లో నితిన్ హీరోగా నటించగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.