
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గతేడాదిలో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
ఆ విషయాలను పట్టించుకోకుండా.. ఈ జంట మాత్రం తమ లైఫ్ తో బిజీగా గడుపుతున్నారు. తాజాగా అంతర్జాతీయ వేదికపై తన భర్త నిక్ గురించి ప్రియాంక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యూయార్క్ లో జరిగిన 10వ అంతర్జాతీయ మహిళా వార్షికోత్సవ సదస్సులో యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. సంస్కృతి సంప్రదాయాలు, శరణార్ధి క్యాంపులలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు. ఆ తరువాత తన భర్త గురించి ప్రశ్నించగా.. ప్రియాంక కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. పెళ్లికి రెండేళ్ల ముందు నుండే నిక్ తనకు తెలుసనని, కానీ అతడిని పెళ్లి చేసుకుంటానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని.. నిక్ విషయంలో తన అంచనా తప్పిందని చెప్పింది.
నిక్ తో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అతడి గురించి ఎంత తపుగా ఆలోచించానో తెలుసుకున్నానని తెలిపింది. అన్ని విషయాల్లో అండగా నిలిచే భర్త దొరికాడని, తనకు ఎప్పుడు ఏం కావాలో చెప్పకుండా అర్ధం చేసుకుంటాడని వెల్లడించింది. చిన్నపిల్లలా తనేం కావాలని గొడవ చేసినా.. ఎక్కడున్నా తీసుకువచ్చి తన ముందు పెడతాడని నిక్ వ్యక్తిత్వం గురించి చెబుతూ మురిసిపోయింది.