
ఒక స్టార్ సినిమాలో మరో హీరో గెస్ట్ గా చేస్తే వచ్చే క్రేజే వేరు. రీసెంట్ గా కమల్ విక్రమ్ లో ...సూర్య రోలెక్స్ గా కనిపించింది కొద్ది నిముషాలే అయినా సినిమాని నిలబెట్టేసింది. అలాగే తెలుగులో వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ కలవటం సినిమాకు భారీగా ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో ప్రభాస్ కామెయోగా కొద్ది సేపు కనపడే పాత్రలో కనపడబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో నటిస్తున్న సూర్య వెయ్యేళ్ల నాటి పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దిషా పటానీ సూర్యకు జోడీగా నటించబోతోంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఎపిక్ యాక్షన్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో సూర్య 5 డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య కనిపించనున్న ఐదు పాత్రల పేర్లు కూడా బయటికి వచ్చేశాయి. అరతార్, వెంకటేటర్, మందాకర్, ముకాటర్, పెరుమానాథర్ అనే ఐదు పాత్రల పేర్లు. ఈ సినిమా పది భాషలలో రిలీజ్ కానుంది. కాబట్టి, సూర్య వన్ మ్యాన్ షో తెరపై ఓ రేంజిలో ఉండబోతోందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మరో క్రేజీ ఎలిమెంట్ యాడ్ కానుందని సమాచారం. అది మరేదో కాదు ప్రభాస్ ఈ సినిమాలో గెస్ట్ గా కనిపించటం.
ఈ సినిమాకి వీర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటించటం ప్లస్ అవుతుందని తమిళ మీడియా అంటోంది. సోషల్ మీడియాలో ఈ విషయమై రచ్చ మామూలుగా లేదు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చేయబోయే పాత్ర ఓ మహారాజు అని, సూర్యతో మొదట విభేదించి, తర్వాత సపోర్ట్ ఇస్తుందని అంటున్నారు. బాహుబలి గెటప్ లో ప్రబాస్ మరోసారి కనపడటం అంటే క్రేజ్ మామూలుగా ఉండదంటున్నారు. సెకండాఫ్ లో ఈ క్యారక్టర్ ని రివీల్ చేస్తారట.
ఈ సినిమా కథ 1678 కాలంలో జరుగుతుందని.. ఇందులో సూర్య ఓ యోధుడిగా కనిపిస్తాడని.. అక్కడినుండి మరో నాలుగు పాత్రలలో సూర్య కనిపించబోతున్నాడని వినికిడి. 1678లో వ్యాధి కారణంగా మరణించే ఒక యోధుడిగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. దిశాపటానీ 1678లో యోధుడిని చంపిన వ్యాధిపై పరిశోధకురాలిగా కనిపిస్తుంది. బహుశా ఆమె అతనికి తిరిగి ప్రాణం పోస్తుందా? అన్నది సస్పెన్స్. ఈ సినిమా కథ పోకడలను బట్టి చూస్తే ప్రపంచాన్ని జయించిన వీరాధివీరుడు అలెగ్జాండర్ కథాంశంతో ఇది తెరకెక్కుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
3డి హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రస్తుతం గోవా- చెన్నైలలో చిత్రీకరిస్తున్నారు. హెవీ డ్యూటీ యాక్షన్ సన్నివేశాలను ఎన్నూర్ పోర్ట్ లో చిత్రీకరించారు. ఆపై చెన్నైలోని EVP వద్ద భారీ పోరాటాలను చిత్రీకరించారు. ఈ చిత్రం 10 భాషలలో విడుదల కానుందని సూర్య కెరీర్ లోనే అతి భారీ చిత్రమిదని టాక్ వినిపిస్తోంది. 'వి' అనే అక్షరం తనకు అదృష్టమని సిరుత్తై శివ భావించినందున ఈ చిత్రానికి 'వీర్' అనే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కె ఇ జ్ఞానవేల్రాజా- వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టూడియోగ్రీన్ తో కలిసి యువిక్రియేషన్స్ ఈ చిత్రం కోసం దాదాపు 200 కోట్లు పైగా బడ్జెట్ ని వెచ్చించిందని కథనాలొస్తున్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యోగి బాబు- కోవై సరళ తదితరులు నటిస్తున్నారు.