
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి సినిమా ఏంటి.. అజ్ఞాతవాసి తర్వాత పవన్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు.. ఏ దర్శకుడితో అయినా... కాంబినేషన్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టే సత్తా వున్న టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేతగా రాజకీయ యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో... రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి పెడతానని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇక తాను రాజకీయాల్లోకి రావడానికి, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయం. ఎవరి మద్దతూ లేదు. నా వంతు కృషి చేసుకుంటూ ముందుకుపోతా’ అని పవన్ తెలిపారు. సోమవారం (జనవరి 22) కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానంతరం కరీంనగర్ చేరుకున్న పవన్.. విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని, ఎన్ని స్థానాల్లో బలం ఉందో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ తెలిపారు. పర్యటన పూర్తి చేసి వచ్చిన తర్వాత కార్యకర్తల సూచనల మేరకు ఎక్కడ బలం ఉందో పరిశీలించి, దాన్ని బట్టి ముందుకుకెళతానని ఆయన చెప్పారు.
సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి, రాజకీయాల్లోనే ఉంటారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ‘అవును. ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతా’ అని అన్నారు.
‘చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. మరి భవిష్యత్‌లో జనసేనను ఎందులోనైనా విలీనం చేస్తారా?’ అనే ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ‘గతంలో ఇదే ప్రశ్న అమిత్‌షా కూడా అడిగారు. ఎందుకు మీకు ఇవన్నీ.. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ ఉండదు.. బీజేపీలోకి వచ్చేయండి అని ప్రతిపాదించగా.. దాన్ని సున్నితంగా తిరస్కరించా’ అని చెప్పారు.