ప్రముఖ కవి, దర్శకుడు బుద్దదేబ్‌ దాస్‌ గుప్తా కన్నుమూత

By Aithagoni RajuFirst Published Jun 10, 2021, 1:00 PM IST
Highlights

ప్రముఖ కవి, బెంగాలీ దర్శకుడు బుద్దదేబ్‌ దాస్‌ గుప్తా(77) ఇక లేరు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ కవి, బెంగాలీ దర్శకుడు బుద్దదేబ్‌ దాస్‌ గుప్తా(77) ఇక లేరు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన దర్శకుడిగా రెండుసార్లు జాతీయ అవార్డు అందుకోగా,ఆయన రూపొందించిన చిత్రాలకు 12 నేషనల్‌ అవార్డులు రావడం విశేషం.  1980,90 దశకాల్లో ప్రముఖ దర్శకులు గౌతమ్ ఘోష్‌, అపర్ణ సేన్‌లతో కలిసి బెంగాల్‌లో సమాంతర సినిమా ఉద్యమానికి నాంది పలికారు దాస్‌గుప్తా.  ఆయన మృతితో బెంగాలీ సినిమా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది.  ఆయన సంచలనాత్మక చిత్రాలతోపాటు,పలు డాక్యుమెంటరీలు రూపొందించారు.

బుద్దదేబ్‌ రూపొందించిన `దూరత్వా` (1978), `గ్రిహజుద్ధ` (1982) , `ఆంధీ గాలి` (1984) వంటి చిత్రాలు బెంగాల్‌లోని నక్సలైట్ ఉద్యమం, బెంగాలీల చైతన్యంపై దాని ప్రభావం ప్రధాన అంశాలుగా వచ్చి గొప్ప సినిమాలుగా నిలిచిపోయాయి. `బహదూర్`‌, `తహదర్‌ కథ`, `చారచార్‌`, `ఉత్తరా` వంటి చిత్రాల ద్వారా దాస్‌గుప్తా దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. `ఉత్తరా` (2000),  `స్వాప్నర్ దిన్` (2005) చిత్రాలకు రెండుసార్లు ఉత్తమ దర్శకత్వానికి జాతీయ అవార్డులు అందుకున్నారు. గోవిర్ అరలే, కాఫిన్ కింబా సూట్‌కేస్, హిమ్‌జోగ్, చాటా కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ట కవితలతో సహా పలు కవితా రచనలు చేశారు. 2019లో పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (డబ్ల్యుబిఎఫ్‌జెఎ) బుద్ధదేవ్‌ దాస్‌గుప్తాకు దివంగత సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.

బుద్ధదేబ్ దాస్‌గుప్తా మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఇంకా పలువురు పరిశ్రమ పెద్దలు, అభిమానులతోపాటు, నిర్మాత, రాజ్ చక్రవర్తి తదితరులు దాస్‌గుప్తా మరణంపై సంతాపం తెలిపారు. మోండో మేయర్ ఉపఖ్యాన్,  కాల్‌పురుష్ వంటి చిత్రాల్లో దాస్‌గుప్తాతో కలిసి పనిచేసిన నటి సుదీప్తా చక్రవర్తి కూడా దాస్‌గుప్తా మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రముఖ సమకాలీన బెంగాలీ చిత్రనిర్మాతలు సత్యజిత్ రే,  ఘటక్‌ తర్వాత అంతర్జాతీయ సినిమా వేదికలపై  ప్రముఖంగా నిలిచిన గొప్ప భారతీయ దర్శకుడంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  

click me!