
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'పొలిమేర 3'. ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. ఈ గ్లింప్స్‌లో అర్జున్ సర్జా 'విరావి' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్) భరత్ నారంగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గుడిలో రహస్య వాతావరణంతో మొదలయ్యే ఈ గ్లింప్స్ వీడియో.. ఆధ్యాత్మికత, అతీంద్రియ శక్తులు, మిస్టరీ దృశ్యాలతో సాగుతుంది. అమావాస్య చీకటిలో విష్ణువు నుంచి శివుడికి, తర్వాత అనంతపద్మనాభ స్వామి దివ్య రూపానికి మారే విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. కథలో చేతబడులు, క్షుద్ర పూజల కోణాన్ని చూపిస్తూ.. కొమురయ్య పాత్రలో సత్యం రాజేష్ కనిపిస్తాడు. ఈ మిస్టరీ, సస్పెన్స్ దృశ్యాల చివరలో అర్జున్ సర్జా 'విరావి' పాత్ర ఎంట్రీ ఇస్తుంది.
కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో అర్జున్ సర్జా
చేతిలో కత్తి పట్టుకుని ఓ వీరుడిలా నిలబడిన అర్జున్ సర్జా మాస్ లుక్ ఈ గ్లింప్స్‌కే హైలైట్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కళ్లలో ఇంటెన్సిటీ ఆ పాత్రకు మరింత బలాన్నిచ్చాయి. 'బాస్ట్' సినిమా తర్వాత అర్జున్ సర్జా చేస్తున్న ఈ పాత్ర 'పొలిమేర' ఫ్రాంచైజీకి కొత్త డైమెన్షన్ ఇస్తుందని భావిస్తున్నారు. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ గ్లింప్స్ స్థాయిని పెంచాయి.
'మా ఊరి పొలిమేర' మొదటి భాగం ఓటీటీలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇతర భాషల ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం 'పొలిమేర 2' థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ఫ్రాంచైజీకి క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'పొలిమేర 3' వస్తోంది. ఇందులో అర్జున్ సర్జా ఎంట్రీ ఇవ్వడం, పైగా 4 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సత్యం రాజేష్ మళ్లీ కొమురయ్య పాత్రలోనే కనిపించనున్నాడు. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాత పార్టుల్లోని కథను మరింత డీప్‌గా తీసుకువెళ్తున్న ఈ సినిమాలో అర్జున్ సర్జా 'విరావి' పాత్ర ఎంతో కీలకం కానుందని కొత్త గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.