
68వ జాతీయ సినీ పురస్కారాల్లో(^8th National Awards) తెలుగు భాషకి చెందిన సినిమాలకు, టెక్నీషియన్లకి నాలుగు అవార్డులు దక్కాయి. సంగీత దర్శకుడిగా థమన్‌కి నేషనల్ అవార్డు రావడం విశేషంగా చెప్పొచ్చు. ఈసందర్భంగా ఆయన స్పందించారు. ట్విట్టర్ ద్వారా తనని బాగా నమ్మిన హీరో అల్లు అర్జున్(Allu Arjun)కి థ్యాంక్స్ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman). మొదటి రోజు నుంచి `అల వైకుంఠపురములో` మ్యూజిక్ బాగా రావడానికి అల్లు అర్జున్ ఇచ్చిన ఎనర్జీనే కారణమని తెలిపారు. `అల వైకుంఠపురములో` చిత్రానికి జాతీయ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. మేమిది సాధించామని తన ఆనందాన్ని పంచుకున్నారు థమన్.
మరోవైపు జీనియస్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram)కి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాకు అవార్డు దక్కేలా చేశారని తెలిపారు. అలాగే `అల వైకుంఠపురములో` సినిమా విషయంలో తనపై నమ్మకంపెట్టుకున్న నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణలకు సైతం థ్యాంక్స్ చెప్పారు థమన్. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. అవి వైరల్‌గా మారాయి.
మరోవైపు జాతీయ అవార్డు సాధించిన విజేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విషెస్ తెలిపారు. 68వ జాతీయ స్థాయి చలన చిత్ర పురస్కార విజేతలకు హృదయ పూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఈ సారి ఎక్కువ శాతం సౌత్ ఇండస్ట్రీకి చెందిన సినిమాలకే అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు పవన్. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అవార్డులు దక్కించుకున్న ఉత్తమ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, ఉత్తమ కొరియోగ్రఫీ సంధ్యారాజు(నాట్యం),ఉత్తమ మేకప్ ఆర్టిస్టు టీవీ రాంబాబు(నాట్యం), ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన `కలర్ ఫోటో`(Color Photo) చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు పవన్.
ఇదిలా ఉంటే 68వ నేషనల్ అవార్డులను ఈ సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. గతంతో పోల్చితే ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి. కరోనా కారణంగా ఆ ఏడాది సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడం ఈ తగ్గదలకు కారణమని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఊహించని విధంగా ఈ సారి సంగీత దర్శకుడు ఎస్‌ఎస్. థమన్‌కి జాతీయ అవార్డు దక్కడం ఓ విశేషమైతే, `కలర్ ఫోటో` అనే ఓ చిన్న చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ భాష చిత్రంగా నేషనల్ అవార్డు దక్కడం మరో విశేషం. అలాగే డాన్సు నేపథ్యంలో వచ్చిన `నాట్యం` చిత్రానికి డాన్సు కొరియోగ్రఫీ, మేకప్ విభాగంలో రెండు జాతీయ అవార్డులు దక్కాయి.