
రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ అమల్లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ (Bheemla Nayak)విడుదల ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఇక సినిమా రిలీజ్ కి పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా.. అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పవన్ సినిమాకు ఉండే డిమాండ్ నేపథ్యంలో ముందుగా టికెట్స్ బుకింగ్ చేసుకోకపోతే మొదటిరోజు సినిమా చూసే అవకాశం దొరకదు.
ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన 12 ఏళ్ల నవదీప్ భీమ్లా నాయక్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకున్నాడు. టికెట్ కొనడానికి అవసరమైన రూ. 300 రూపాయలు తండ్రిని అడిగాడు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వని నవదీప్ తండ్రి.. కొంత సమయం కోరాడట. ఇంతలోనే మనస్థాపానికి గురైన నవదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఎగతాళి చేయడం కూడా నవదీప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. భీమ్లా నాయక్ టికెట్ కి డబ్బు దొరకలేదంటే ఫ్రెండ్స్ ముందు పరువుపోతుందని భావించిన నవదీప్ దారుణానికి ఒడిగట్టాడు.
కేవలం అభిమాన హీరో సినిమా టికెట్ కి డబ్బులు ఇవ్వలేదని ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు ఉసురు తీసుకోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆర్తనాథాలతో ఆ ప్రాంతంలో విషాదకర ఛాయలు అలముకున్నాయి. అభిమానం వెర్రితలలు వేస్తుందనడానికి తాజా ఉదంతం పెద్ద ఉదాహరణ. నవదీప్ బలవన్మరణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఇలాంటి క్షణికావేశానికి లోనై అఘాయిత్యాలకు పాల్పడకూడదని కొందరు హితవు పలుకుతున్నారు. గతంలో కూడా అభిమాన హీరో సినిమా కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.