
బ్రో మూవీకి మొదటి నుండి హైప్ లేదు. అసలు వినోదయ సితం రీమేక్ వద్దని ఫ్యాన్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆల్రెడీ చేసిన గోపాలా గోపాలా మూవీని తలపించేలా ఉంటుంది. ఈ కథ పవన్ ఇమేజ్ కి ఏ మాత్రం సెట్ కాదనే వాదన వినిపించింది. ఫ్యాన్స్ వ్యతిరేకతను పట్టించుకోకుండా మితృడు త్రివిక్రమ్ సలహాను పాటిస్తూ వినోదయ సితం చేశాడు పవన్. తన పొలిటికల్ షెడ్యూల్స్ కి సైతం ఈ చిత్ర కథ సహకరిస్తుంది. తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చనే ఆలోచన కూడా ఇందుకు కారణం.
ఇక ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ స్టోరీని కిచిడి కిచిడి చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. ఆయన లుంగీ కడితే, బీడీ కాల్చితే, కాలర్ ఎగరేస్తే సినిమా ఆడేస్తుంది అన్నట్లు తీశారు. కథకు సన్నివేశాలకు సంబంధం లేకుండా అందులో మళ్ళీ పొలిటికల్ ప్రాపగాండా. మొత్తంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ప్రయోజనాలు నెరవేరాయి కానీ సినిమా మాత్రం పోయింది. బ్రో చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ రూ. 15 కోట్లకు పైనే తీసుకున్నాడని సమాచారం.
పవన్ కెరీర్లోనే పూర్ ఓపెనింగ్స్ బ్రో నమోదు చేసింది. తక్కువ టికెట్ రేట్లతో బెనిఫిట్ షోలు లేకుండా విడుదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ కంటే దారుణంగా బ్రో ఓపెనింగ్ డే వసూళ్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రోల్ పూర్తి స్థాయిలో ఉన్నా వర్క్ అవుట్ కాలేదు. నిజానికి అదే మైనస్. పవన్ కళ్యాణ్ కోసం అసలు కథను చంపేశారు. చెప్పాలనుకున్న ఎమోషన్ కనెక్ట్ కాలేదు. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో నింపేసి చివర్లో కథ చెబితే ఎవరు చూస్తారనే వాదన వినిపిస్తోంది.
రెండో రోజే బ్రో వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయాయి. ఆంధ్రాలో ఫస్ట్ డే నుండే డల్ గా ఉన్నాయి. వీకెండ్ వరకూ నెట్టుకొచ్చిన బ్రో మండే కూలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బ్రో రూ. 2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. నైజాంలో కేవలం రూ. 99 లక్షల షేర్ వసూలు చేసింది. నాలుగు రోజులకు నైజాంలో రూ. 18 కోట్ల షేర్ అందుకుంది. నైజాం రైట్స్ రూ. 30 కోట్లకు అమ్మారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 81 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 97 కోట్ల వరకు అమ్మారు. నాలుగు రోజులకు రూ. 55 నుండి 60 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. వంద కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన బ్రో అప్పుడే నెమ్మదించింది. అద్భుతాలు జరిగితే తప్ప డిజాస్టర్ నుండి బయటపడే మార్గం లేదని ట్రేడ్ వర్గాల అంచనా.