
ఈ ఏడాది అందరిని ఆశ్చర్యపరిచిన చిత్రం అంటే 'బలగం' గురించే చెప్పాలి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మనసుని హత్తుకునే భావోద్వేగాలతో వేణు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు.
తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమే చేసింది. ఇప్పుడు ఓటిటిలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో సైతం ఈ చిత్రాన్ని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ భాష, యాస, పల్లెటూరి సంప్రదాయాలు, మనుషుల మధ్య బంధాలని వేణు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలకు ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
కుటుంబ బందాలని దర్శకుడు వేణు హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించారు. తాజాగా ఈ చిత్రంపై సీనియర్ రచయిత పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బలగం చిత్రం చూసిన తర్వాత కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. కన్నీరు పెట్టని వారు ఎవరైనా ఉంటే తనకి మెసేజ్ చేయాలని పరుచూరి కోరారు.
జబర్దస్త్ కమెడియన్ గా హాస్యం పండించే వేణులో ఇంత అద్భుతమైన ట్యాలెంట్ ఉందా అని తాను ఆశ్చర్యపోయినట్లు పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. సినిమా గురించి, స్క్రీన్ ప్లే గురించి తెలిసిన తానే కన్నీరు ఆపుకోలేకపోయాను అంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అని పరుచూరి అన్నారు.
ఈ చిత్రం చూశాక బలగంకి పాటలు రాసిన కాసర్ల శ్యామ్ కి ఫోన్ చేసి అభినందించా. అలాగే వేణు ఫోన్ నంబర్ కూడా అడిగి తీసుకున్నా. వేణుని కూడా అభినందించా అని పరుచూరి తెలిపారు. అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం పదిరెట్లు వసూళ్లు సాధించింది అని ప్రశంసించారు. పెద్ద దర్శకుడు అవసరం లేదు.. పెద్ద నటులు అవసరం లేదు.. స్టార్ హీరోలు అక్కర్లేదు.. మంచి కథ ఉంటే చాలు అని బలగం చిత్రం నిరూపించినట్లు పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.