జూ. ఎన్టీఆర్ సినిమాపై కాపీ ఆరోపణలు.. నా కథని దొంగిలించారు!

By AN TeluguFirst Published May 13, 2019, 12:20 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా, రభస లాంటి ప్లాపుల తర్వాత టెంపర్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వక్కంతం వంశీ టెంపర్ కథని రచించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా, రభస లాంటి ప్లాపుల తర్వాత టెంపర్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వక్కంతం వంశీ టెంపర్ కథని రచించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. పూరి ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా చూపించాడు. ఇక ఎన్టీఆర్ ఎప్పటిలాగే నటనతో అదరగొట్టేశాడు. మొత్తంగా టెంపర్ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మెమొరబుల్ మూవీగా మిగిలిపోయింది. 

టెంపర్ కథలో ఉన్న వైవిధ్యాన్ని పసిగట్టిన ఇతర భాషల నిర్మాతలు రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నారు. హిందీలో రణవీర్ సింగ్ హీరోగా సింబా పేరుతో రీమేక్ అయిన టెంపర్ అక్కడ కూడా ఘనవిజయాన్ని అందుకుంది. తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం కూడా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం దిశగా దూసుకుపోతోంది. టెంపర్ చిత్రం విడుదలై నాలుగేళ్లు గడిచిపోతోంది. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రంపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. 

టెంపర్ చిత్ర కథ కాపీ అంటూ ఆరోపించినది ఎవరో కాదు.. విశాల్ అయోగ్యలో విలన్ గా నటించిన పార్తీబన్. 1993లో పార్తీబన్ హీరోగా ఉల్లే వెళియే అనే చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. ఈ చిత్ర కథతో టెంపర్ కథకు కాస్త పోలికలు ఉంటాయి. నా కథని కాపీ చేసి టెంపర్ చిత్రాన్ని తీశారు. నా కథని దొంగిలించారు.. నాకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు అంటూ పార్తీబన్ ఆరోపిస్తున్నారు. టెంపర్ విడుదలైన ఇన్నేళ్ల తర్వాత, అది కూడా అయోగ్య చిత్రంలో తానే విలన్ గా నటించి, ఇప్పుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత పార్తీబన్ కాపీ ఆరోపణలు చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. 

టెంపర్ నిజంగా కాపీనా కాదా అనే విషయం పక్కన పెడితే.. అయోగ్య చిత్రంలో నటించిన తర్వాత పార్తీబన్ ఇలాంటి ఆరోపణలు చేస్తూ పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

click me!