ఇలాంటి ఆరోపణలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చునేది లేదు: ఎన్టీఆర్‌ వార్నింగ్

By Surya PrakashFirst Published Oct 3, 2024, 7:22 AM IST
Highlights

వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్‌ (NTR) మండిపడ్డారు.


  కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్ ను చిత్ర పరిశ్రమ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తో పాటు నాని,  దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, రచయిత అబ్బూరి రవి సైతం ఈ విషయమై ఖండనలో కూడిన కామెంట్స్ చేసారు. 
 
 ఇప్పటికే  కొండా సురేఖ కామెంట్స్ ను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఖండించారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్‌ (NTR) మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని (Nani) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శుద్ధి చెయ్యాల్సింది నదిని కాదు. వాళ్ళ బుద్ధిని. ఛీ!!! ఇంత నీచమా...’’ -సినీ రచయిత అబ్బూరి రవి అన్నారు.


కొండా సురేఖ కామెంట్స్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ...


‘‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’’ అన్నారు.

Latest Videos


కొండా సురేఖ కామెంట్స్ పై  హీరో నాని స్పందిస్తూ...


‘‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.  బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’’ - నాని


కొండా సురేఖ కామెంట్స్ పై  ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల


‘‘రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. 365 డేస్ ప్రతిరోజు సమంత మేడంని దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. ఆమె సినిమా ఇండస్ట్రీకి దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్‌గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కల అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు వినడం నిజంగా బాధగా ఉంది. పదవి, అధికారం ఉన్నా గౌరవాన్ని కొనలేరు. సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయి. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ప్రతి చోటా లింగ అసమానత్వం ఉంది. మహిళలందరూ దీనిని ఖండించాలి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఇష్యూ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది’’ - ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల

 

click me!