
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. రాజకీయంగానూ బిజీగా ఉన్నప్పటికీ ఆయన కొత్త సినిమాలకు సైన్ చేస్తూ షాకిస్తున్నాడు. ఎన్నికల ఖర్చుకోసం పవన్ సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలుండబోతున్నాయి. కానీ ఇప్పటికే ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యే నాటికి ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు.
పవన్ ప్రతి సినిమాకి ముప్పై, నాలభై రోజులకు మించి డేట్స్ ఇవ్వడం లేదని సమాచారం. `హరిహర వీరమల్లు` పీరియాడికల్ మూవీ కావడంతో దానికి కాస్త టైమ్ పడుతుంది. ఎక్కువ ఖాల్షీట్లు అవసరం అవుతున్నాయి. కానీ మిగిలిన చిత్రాలకు ముప్పై నుంచి నలభై రోజులే కేటాయించారట. ఇందులో `వినోదయ సీతం` చిత్ర రీమేక్‌కి మాత్రం మరీ 20నుంచి 25రోజులే ఇచ్చారట. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు. సాయి పాత్ర మెయిన్ గా ఉంటూ, పవన్ రోల్ కీలకంగా ఉండబోతుందని సమాచారం. అయితే ఇందులో పవన్ దేవుడిగా కనిపించబోతున్నారు. మాతృకలో సముద్రఖని పోషించిన పాత్రని పవన్ చేస్తున్నారు. ఆ రకంగా మాతృకలో దేవుడి పాత్రని పవన్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ టోటల్‌గా 25 రోజుల డేట్స్ ఇచ్చినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి అభిమానులకు షాకిచ్చే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పవన్‌కి హీరోయిన్ లేదట. మాతృకలోనూ హీరోయిన్ లేదు. దీంతో అదే కంటిన్యూ చేస్తున్నారట. అయితే హీరోయిన్ లేకుండా పవన్‌ని ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో `గోపాల గోపాల` చిత్రంలో పవన్ కీలక పాత్రలో దేవుడిగా కనిపించారు. అందులో ఆయనకు హీరోయిన్ లేదు. వెంకటేష్ మెయిన్ లీడ్‌గా చేయగా, ఆయనకు జోడీగా శ్రియా చేసింది. పవన్‌కి మాత్రం హీరోయిన్ లేదు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఇప్పుడు `వినోదయ సీతం` చిత్ర రీమేక్‌లోనూ సేమ్ రిపీట్ కాబోతుందట. అయితే ఇందులో పవన్ పై ఓ పాట ఉంటుందని, కానీ అందులోనూ హీరోయిన్ ఉండదని సమాచారం. కానీ సినిమాలో సాయిధరమ్ తేజ్‌కి జోడీగా కేతిక శర్మ హీరోయిన్‌గా తీసుకున్నారు. మలయాళ ముద్దుగుమ్మ, వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించబోతుందట. కానీ పవన్‌కి మాత్రం పెయిర్ లేదని సమాచారం. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కిది షాకిచ్చే విషయమే. మరి దీన్ని అభిమానులు ఎలా తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
ఇక పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్`, సుజీత్ దర్శకత్వంలో `ఓజీ` మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాలన్నింటినీ ఈ ఏడాది పూర్తి చేయాలని భావిస్తున్నారు పవన్. అనుకున్నట్టు కంప్లీట్ అయితే మరో ఆరు నెలల నుంచి ఇక వరుసగా పవన్ సినిమాల జాతర కొనసాగుతుందని, అభిమానులకు పెద్ద పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.