
సమయం చాలా విలువైనది. అనుకున్న ప్రాజెక్ట్స్ సమయానికి పట్టాలెక్కకపోతే కెరీర్ నాశనమవుతుంది. పదుల సంఖ్యలో దర్శకులున్న పరిశ్రమలో స్టార్ హీరోలు ఆరేడుగురు మాత్రమే ఉన్నారు. ఇక పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో ఒక్కో సినిమాకు రెండు నుండి మూడేళ్లు కేటాయిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ ఒకటి రెండు చిత్రాలు ప్రకటించి ఉన్నారు. ఈ క్రమంలో వారితో సినిమా చేయాలంటే చాలా కాలం ఎదురుచూడాలి.
ఇక గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. 2012లో గబ్బర్ సింగ్ విడుదల కాగా ఈ పదేళ్లలో చేసింది నాలుగు సినిమాలు మాత్రమే. రామయ్యా వస్తావయ్యా చిత్రంతో ఎన్టీఆర్ కి భారీ ప్లాప్ ఇవ్వడంతో స్టార్స్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం మిక్స్డ్ టాక్ తో యావరేజ్ హిట్ అందుకుంది. ఇక హరీష్ గత చిత్రం గద్దలకొండ గణేష్ పర్వాలేదు అనిపించుకుంది. ఇది కూడా రీమేక్ కావడం విశేషం.
కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేని సమయంలో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ నిర్ణయం హరీష్ కి మేలు చేసింది. పవన్ (Pawan Kalyan) వరుసగా చిత్రాలు ప్రకటించగా హరీష్ శంకర్ తో కూడా ఓ మూవీకి సైన్ చేశారు. దీంతో హరీష్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చక చకా స్క్రిప్ట్ సిద్ధం చేసి టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న సమయంలో పవన్ నిర్ణయాలు హరీష్ కి షాక్ ఇచ్చాయి. ముందుగా ప్రకటించిన హరీష్ మూవీ పక్కనపెట్టి భీమ్లా నాయక్ చేశారు.
ఇప్పుడు ఏకంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagathsingh) మూవీ అనుమానమే అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా ఈ కొద్ది సమయంలో మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు తో పాటు వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేయాలి అనుకుంటున్నారు. అనంతరం 2024 ఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే హరీష్ కి మొండి చెయ్యే అన్నట్లుంది. నిజంగా పవన్ ప్రాజెక్ట్ రద్దు లేదా డిలే అయితే హరీష్ చిక్కుల్లో పడ్డట్లే.
ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేని నేపథ్యంలో హరీష్ టూ టైర్ హీరోలతో సినిమా చేసుకోవాలి. చివరకు విజయ్ దేవరకొండ, నాని కూడా ఒకటికి రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఏక కాలంలో నాలుగు సినిమాలు చేస్తున్న రవితేజ హరీష్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కలదు. అది కూడా ఓ ఏడాది తర్వాత. గతంలో దర్శకుడు సంపత్ నందికి పవన్ ఇలానే హ్యాండిచ్చాడు. రచ్చ మూవీ అనంతరం సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సందీప్ తో చేస్తానన్న పవన్ చివర్లో ఆ ఆఫర్ దర్శకుడు బాబీకి ఇచ్చారు. ఆ మూవీ కోసం సంపత్ నంది ఏళ్ల తరబడి ఎదురుచూశాడు.