
ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతి పట్ల బాలీవుడ్ మొత్తం విషాదంలో ఉంది. గురువారం ఉదయం ఆయన గుండె పోటు తో ఆకస్మికంగా మరణించారు. 1983లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కౌశిక్ హాస్య నటుడిగా అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు. బాలీవుడ్ లో ఆయనకి ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. చాలా మందితో మంచి స్నేహం ఉంది.
సతీష్ కౌశిక్ మరణంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా సతీష్ కౌశిక్ కి ఒకప్పటి స్టార్ హీరోయిన్ సీనియర్ నటి నీనా గుప్తా కూడా మంచి స్నేహితురాలు. సతీష్ మృతితో ఆమె తన విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వీడియో సందేశం ద్వారా సతీష్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'మా స్నేహం కాలేజీలో మొదలయింది. నన్ను ఈ ప్రపంచంలో నాన్సీ అని పిలిచేది ఆయన ఒక్కరే. నేను ఆయన్ని కౌషి ఖాన్ అని పిలుస్తాను. ఇకపై ఆ పిలుపులు ఉండవు. ఇక ఆయన లేరు. విషాదకర వార్తతో నిద్ర లేచాను' అని నీనా గుప్తా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఒకప్పుడు సతీష్ కౌశిక్.. నీనా గుప్తాని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని నీనా గుప్తా స్వయంగా తన ఆత్మకథలో పేర్కొన్నారు. నీనా గుప్తా.. అప్పటి స్టార్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ వల్ల పెళ్లి కాకుండానే గర్భవతి అయిన సంగతి తెలిసిందే. దీనితో అప్పట్లో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆ సమయంలో సతీష్ కౌశిక్ నీనా గుప్తాని ఓదార్చారట. 'బాధపడకు.. మనం పెళ్లి చేసుకుందాం.. ఒక వేళ పుట్టబోయే బిడ్డ చమన ఛాయలో ఉంటే నా బిడ్డే అని చెప్పు. అప్పుడు నిన్ను ఎవరూ అనుమానించరు' అని సతీష్ తనతో చెప్పినట్లు నీనా గుప్తా ఆత్మకథలో పేర్కొంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహం జరగలేదు.