రివ్యూ: నన్ను దోచుకుందువటే

By Udayavani DhuliFirst Published Sep 21, 2018, 12:25 PM IST
Highlights

'సమ్మోహనం' చిత్రంతో హిట్ అందుకున్న తరువాత హీరో సుధీర్ బాబు నటించిన నూతన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రంతో ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఈ కథ బాగా నచ్చడంతో సుధీర్ బాబు స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించాడు. 

నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు తదితరులు 
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్: అజనీష్ బి లోకనాథ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
నిర్మాత: సుధీర్ బాబు
స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: ఆర్.ఎస్.నాయుడు

'సమ్మోహనం' చిత్రంతో హిట్ అందుకున్న తరువాత హీరో సుధీర్ బాబు నటించిన నూతన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రంతో ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఈ కథ బాగా నచ్చడంతో సుధీర్ బాబు స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించాడు. విడుదలకు ముందు ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
కార్తిక్(సుధీర్ బాబు) హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మ్యానేజర్ గా పని చేస్తుంటాడు. అతడు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో.. తన కింద పనిచేసేవారు కూడా పని విషయంలో అలానే ఉండాలని కోరుకుంటాడు. దీంతో ఆఫీస్ లో అందరూ అతడిని విలన్ లా చూస్తుంటారు. ప్రమోషన్ సంపాదించి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనేది కార్తిక్ లక్ష్యం. దానికోసం చాలా కష్టపడుతుంటాడు. ఫ్రెండ్స్, తిరగడం వంటి వ్యవహారాలకు అతడు చాలా దూరం. ఇంట్లో వాళ్లు కార్తిక్ కి తన మరదలితో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఆ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో కార్తిక్ తను సిరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తన తండ్రి(నాజర్)కి చెబుతాడు. దీంతో సిరిని చూడడానికి హైదరాబాద్ వస్తున్నట్లు చెబుతారు.

లేని సిరిని ఎలా తీసుకురావాలో తెలియక మేఘన(నభా నటేశ్) అనే షార్ట్ ఫిలిం నటిని తన గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి డీల్ మాట్లాడతాడు. మొదట దీనికి అంగీకరించకపోయినా.. డబ్బు అవసరం ఉండడంతో మేఘన కూడా ఒప్పుకుంటుంది. ఆమె మాటలు ప్రవర్తన నచ్చడంతో కార్తిక్ కి ఆమె సరైన జోడి అని నమ్ముతాడు అతడి తండ్రి. రెండు రోజులు నటిస్తే చాలని అనుకున్న మేఘనకి సిరి అనే క్యారెక్టర్ ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఈ క్రమంలో కార్తిక్, మేఘన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? వీరు నిజంగా ప్రేమికులు కాదనే విషయం కార్తిక్ ఇంట్లో వాళ్లకి తెలుస్తుందా..? లేక వీరిద్దరూ నిజంగానే ఒకరినొకరు ఇష్టపడతారా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
కథగా చెప్పాలంటే మహా అయితే రెండు లైన్ల స్టోరీ ఇది. పెళ్లి నుండి తప్పించుకోవడానికి హీరో చెప్పిన అబద్ధం కారణంగా అతడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే చిన్న పాయింట్ ని కథగా ఎన్నుకున్నాడు దర్శకుడు. ఆ కథకి హాస్యం జోడించి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. అసలు అమ్మాయిలకే దూరంగా ఉండే హీరో.. హీరోయిన్ కోసం షార్ట్ ఫిలిమ్స్ లో నటించాలనుకోవడం, ఆమె కోసం తన సమయం మొత్తం కేటాయించడం వంటివి రొటీన్ అయినప్పటికీ తెరపై మాత్రం కొత్తగా ఆవిష్కరించారు. అప్పటివరకు సీరియస్ గా తన పని తాను చేసుకుంటూ ఉండే హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కలర్ ఫుల్ గా మారిపోతుంది. నటించడానికి వచ్చిన అమ్మాయి నిజంగానే హీరోతో ప్రేమలో పడిపోతుంది.

హీరోకి కూడా ఆమెపై ప్రేమ ఉన్నప్పటికీ చెప్పలేని పరిస్థితుల్లో ఆమెను దూరం చేసుకుంటాడు. ఇలాంటి సన్నివేశాలను ఎమోషనల్ గానే కాకుండా లైట్ వేలో చూపించడం బాగుంది. దీంతో హీరో చేసేది కరెక్టే కదా అని అనిపించకమానదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పిస్తుంది. సుధీర్ బాబు, నభా నటేశ్, వైవా హర్షల మధ్య చిత్రీకరించిన కామెడీ ఎపిసోడ్ సినిమాకే హైలైట్. 'బిస్కెట్' అనే షార్ట్ ఫిలింలో హీరోగా సుధీర్ ని ఎంపిక చేస్తే అతడు డైలాగ్ ని సరిగ్గా చెప్పలేక రకరకాల వెర్షన్స్ లో చెప్పడం ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ఒక్క సీన్ కోసం సినిమా చూడొచ్చు. ఈ సన్నివేశంలో సుధీర్ బాబు నటన హిలారియస్.

అలానే హీరోతో.. శ్యామల అనే జూనియర్ ఆర్టిస్ట్ వేసే వేషాలు కూడా నవ్విస్తాయి. సీరియస్ లవ్ ట్రాక్ మాదిరి కాకుండా కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడం బాగుంది. పరిస్థితుల కారణంగా ప్రేమ పుట్టినట్లు కాకుండా నిజంగా ఒకరినొకరు ఇష్టపడినట్లు చూపించారు. పతాక సన్నివేశాల్లో సుధీర్ బాబు, నాజర్ ల మధ్య ఎమోషన్ సరిగ్గా పండలేదు. అయితే ఆ తరువాత హీరోయిన్ పెళ్లి ఎపిసోడ్ పెడుతూ అక్కడ కూడా కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. కామెడీ లవ్ స్టోరీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం సంతృప్తినిస్తుంది. మరీ నిదానంగా నడిపించకుండా, మిడిల్‌ పార్ట్‌ని మరీ అంత రొటీన్‌గా మలచకుండా వున్నట్టయితే సినిమా సూపర్ హిట్ అయ్యేది కానీ ఇప్పటికి దీనికున్న ఆకర్షణలతో ఒకసారి నిక్షేపంగా చూసి రావచ్చు. నవ్వించే హాస్యానికి తోడు మెప్పించే అనుభూతులకి కూడా ఇందులో లోటు లేదు.

సుధీర్‌బాబు నటుడిగా ఎంత పరిణితి చెందాడనేది తెలియడానికి ఇందులో చాలానే సన్నివేశాలున్నాయి. కామెడీ, ఎమోషన్, లవ్ ఇలా చాలా సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు. హీరోయిన్ నభా నటేశ్ తెరపై అల్లరి చేస్తూ బొమ్మరిల్లులో జెనీలియాని గుర్తు చేసింది. ఆమె నటనతో ఆడియన్స్ ని మెప్పించింది. నాజర్, తులసి తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వెన్నెముక అయ్యారు. అజనీష్ బి లోకనాథ్ సంగీతం ఈ చిత్రానికే ప్రధానాకర్షణ కాగా, సురేష్ రగుతు ఛాయాగ్రహణం కథలోని ఛార్మ్‌ని ఫ్రేమ్స్‌లో నింపగలిగింది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ వహించాల్సి వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ  ఆర్.ఎస్.నాయుడు తన ప్రతిభతో సక్సెస్ అందుకున్నాడు. 

రేటింగ్: 2.75/5 

                            

 

click me!