
చాలా రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు నాని `వి` సినిమా టీం తెర దించింది. లాక్ డౌన్‌కు ముందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలా రోజులుగా రిలీజ్ విషయంలో సందిగ్థంలో ఉంది. థియేటర్లు ప్రారంభమయ్యాక రిలీజ్ చేయాలా లేక ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయాలా అర్ధం కాక చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ఓటీటీలోనూ లాభాల వచ్చే స్థాయి ఆఫర్లు వచ్చినా థియేట్రికల్ రిలీజ్‌కు ఉండే రేంజ్ ఉండదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు.
అయితే ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే అవకాశం లేకపోవటం, థియేటర్లు తెరచినా ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారా అన్న అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో వి సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. ఈ మేరకు గురువారం అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ మేరకు నాని తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ రోజు యాక్షన్ థ్రిల్లర్ వి సినిమాకు సంబంధించిన గ్లోబల్ ప్రీమియర్‌ను ప్రకటించింది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ‘నేచురల్ స్టార్’ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరిలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా భారత్ పాటు 200 దేశాల్లో 2020 సెప్టెంబర్ 5 స్ట్రీమ్ అవుతుందని ప్రకటించారు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న తొలి స్టార్ హీరో సినిమా వి అని ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ఇండియా కంటెంట్, డైరెక్టర్ హెడ్ విజయ్ సుబ్రహ్మాణియం ఓ ప్రకటన చేశారు.
`నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. ఇవి సాధారణ పరిస్థితులు కాదు, అందుకే ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు కూడా అసాధారణంగానే ఉన్నాయి. నా 25 చిత్రం నాకు ఎంతో స్పెషల్ కానీ ఇప్పుడు ఆ సినిమా మరింత స్పెషల్ అయ్యింది. దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం చేద్దాం. సెప్టెంబర్ 5న వి సినిమా రిలీజ్ ను సెల్రబేట్ చేసుకుందాం. గత 12 ఏళ్లుగా మీరు నన్ను చూడటానికి థియేటర్లకు వచ్చారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెబుతాను. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత టక్ జగధీష్‌తో పలకరిస్తా` అంటూ మెసేజ్ చేశాడు నాని.
నాని తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైదరీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.