
తెలుగు పాట 'నాటు నాటు' ఆస్కార్ సాధించి భారత దేశానికే గర్వకారణంగా నిలిచింది. అకాడమీ అవార్డ్స్ లో ఈ ఘనత సాధించిన తొలి పాట ఇదే. ఆ మాటకు వస్తే ఆసియాలోనే ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ సాంగ్ నాటు నాటు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. అయితే నాటు నాటు ఆస్కార్ అందుకోవడం మాత్రం నెక్స్ట్ లెవల్.
ప్రపంచం నలుమూలల నుంచి రాజమౌళికి, ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. నాటు నాటు సాంగ్ విడుదలైనప్పటి నుంచే వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ సృష్టించింది. గ్లోబల్ సెన్సేషన్ గా నిలిచింది. ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా నాటు నాటులో చరణ్, ఎన్టీఆర్ హుక్ స్టెప్ ని అనుకరిస్తూ మిలియన్ల రీల్స్ చేశారు. జపాన్, అమెరికా, ఇంగ్లాంట్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో నమ్మశక్యం కాని విధంగా నాటు నాటు పాట అలరించింది.
ఇప్పటికే నాటు నాటు సాంగ్ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆస్కార్ గెలిచిన తర్వాత ఆన్లైన్ లో మరోసారి నాటు నాటు ఉప్పెన మొదలయింది. గూగుల్ సెర్చ్ లో నాటు నాటు సాంగ్ తాజాగా రికార్డు సృష్టించింది. ఒక్కసారిగా నాటు నాటు గూగుల్ సెర్చ్ నంబర్స్ 10 రెట్లు వరల్డ్ వైడ్ గా పెరిగాయి. 1,105 శాతం నాటు నాటు సాంగ్ గూగుల్ సెర్చ్ పెరిగిందని తాజా రికార్డ్స్ చెబుతున్నాయి.
ఆస్కార్ గెలిచిన తర్వాత నాటు నాటు సాంగ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నాటు నాటు సాంగ్ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు, ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఆస్కార్ గెలవడంతో అసలు ఈ పాటలో, చిత్రంలో ఏముంది అని ఆరాతీయడం మొదలు పెట్టారు. ఫలితంగా నాటు నాటు సాంగ్ సెర్చ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా జపాన్, యుఎస్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పాటకి కీరవాణి సంగీతం అందించగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఎంతో ఎనెర్జిటిక్ గా పాడారు. ఈ పాటకి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తెరవెనుక హీరో అని చెప్పాలి. ఆయన అందించిన స్టెప్పులు ఫ్యాన్స్ ని ఉర్రూతలు ఊగించాయి. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ తమ డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లారు.
నాటు నాటు పాటకి పోటీగా ఆస్కార్ బరిలో హాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్స్ అయిన లేడి గాగా, పాప్ సంగర్ రియానా పాటలు కూడా నిలిచాయి. కానీ వాటిని బీట్ చేస్తూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడం మైండ్ బ్లోయింగ్ ఫీట్ అనే చెప్పాలి.