రాజమౌళితో సినిమా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కళ్యాణి మాలిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. `నాటు నాటు` ఆస్కార్‌పై స్పందన..

Published : Mar 08, 2023, 05:15 PM ISTUpdated : Mar 08, 2023, 05:31 PM IST
రాజమౌళితో సినిమా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కళ్యాణి మాలిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. `నాటు నాటు` ఆస్కార్‌పై స్పందన..

సారాంశం

సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్‌ తాజాగా తన సోదరుడు రాజమౌళితో పనిచేయడంపై స్పందించారు. అంతేకాదు `నాటు నాటు` సాంగ్‌ ఆస్కార్‌ బరిలో నిల్చిన నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా డీసెంట్‌ మూవీస్‌ చేసుకుంటూ వస్తున్నారు. టేస్ట్ ఉన్న చిత్రాలతో తన మార్క్ ని చాటుకుంటున్నారు. తాజాగా ఆయన `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` చిత్రానికి వర్క్ చేశారు. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించారు. ఆయనతో ఇది మూడో సినిమా. గతంలో ఈ దర్శకుడు రూపొందించిన `ఊహలు గుసగుసలాడే`, `జ్యో అచ్యుతానంద` చిత్రాలకు సంగీతం అందించారు. ఇప్పుడు మూడో సినిమాగా `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` చిత్రానికి వర్క్ చేశారు. ఇందులోని `కనుల చాటు మేఘమా` పాట బాగా పాపులర్‌ అయ్యింది. నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా గురించి, `ఆర్‌ఆర్‌ఆర్‌` లోని `నాటు నాటు గురించి, రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కళ్యాణి మాలిక్‌ స్వయంగా సంగీత దర్శకుడు కీరవాణికి సోదరుడు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో `నాటు నాటు` పాట ఆస్కార్‌ కి నామినేట్‌ కావడంపై కళ్యాణ్‌ మాలిక్‌ స్పందించారు. అన్నయ్య స్వరపరిచిన పాట ఆస్కార్‌ బరిలో నిలవడం చాలా గర్వంగా ఉందన్నారు. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద ఉన్న నమ్మకమే అక్కడి వరకు తీసుకెళ్లింది. ఆస్కార్‌ వస్తుందా, లేదా అనేది పక్కన పెడితే అసలు నామినేషన్స్ వరకు వెళ్లడం చాలా హ్యాపీగా ఉందన్నారు. అంతేకాదు రాజమౌళితో వర్క్ చేయడంపై కూడా ఆయన ఓపెన్‌ అయ్యారు.

భవిష్యత్తులో రాజమౌళి సినిమాకి మీరు పనిచేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకి కళ్యాణ్‌ మాలిక్‌ స్పందిస్తూ, ఇంట్రెస్టింగ్‌గా రియాక్ట్ అయ్యారు. `రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లు నాకు చాలా ఇష్టం. ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటాయి. రాజమౌళి సినిమాలకు అన్నయ్య అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నప్పుడు.. ఆ స్థానాన్ని ఎవరు భారీ చేస్తారని ఆలోచించడం అనవసరం. అలాగే సుకుమార్ అంటే కూడా ఇష్టం. సుకుమార్ రైటింగ్స్ లో ఆయన నిర్మించే సినిమాకి నేను సంగీతం అందించాలని కోరుకుంటాను కానీ ఆయన దర్శకత్వం వహించే సినిమాకి సంగీతం అందించాలని కోరుకోను. రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీప్రసాద్ ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటుంది` అని తెలిపారు. 

ఇక ఈ చిత్రానికి వర్క్ చేయడం గురించి చెబుతూ, ఇటీవల విడుదలైన 'కనుల చాటు మేఘమా' పాటకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి. ఇది మోహం లేని మధురమైన ప్రేమ. ఇటువంటి సందర్భంలో వచ్చిన ప్రేమ పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. శ్రీనివాస్ అభిరుచికి తగ్గట్లుగా స్వరపరచడం జరిగింది. కేవలం ట్యూన్ మాత్రమే కాదు.. లక్ష్మీభూపాల్ గారు రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం ఎంతో నచ్చాయి. ఈ పాట హిట్ అవ్వడంలో వాళ్ళ ప్రమేయం చాలా ఉంది. రూపుదిద్దుకుంటున్నప్పుడే ఈ పాట హిట్ అవుతుందని నాకు తెలుసు. అందుకే ముందు నుంచే ఆ పాట పట్ల ప్రేమ పెంచుకుంటూ వచ్చాను. దానికి తగ్గట్టుగానే విడుదలవ్వగానే అందరికీ నచ్చడం సంతోషాన్నిచ్చింది.

నా సంగీతం, నా పాటలు బాగున్నాయి అని ప్రశంసలు దక్కాయి. నేను స్వరపరిచిన పాటలు పాడిన వారికి అవార్డులు వచ్చాయి. కానీ ఎందుకనో నాకు అవార్డులు రాలేదు. ఈ సినిమాకి లిరిక్ రైటర్ గా లక్ష్మీభూపాల్, సింగర్ గా ఆభాస్ జోషి అవార్డులు అందుకుంటారనే నమ్మకం ఉంది. అయితే అవార్డులు కంటే కూడా నా పాట బాగుందనే పేరే నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. నిజానికి ఈ సినిమాకి ముందుగా వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఐదు పాటల్లో ఆయనొక పాట స్వరపరిచారు. ఈ సినిమా 2019 లోనే మొదలైంది, కానీ కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత వివేక్, శ్రీనివాస్ అడగడంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. వివేక్ సాగర్ స్వరపరిచిన పాట అప్పటికే షూటింగ్ అయిపోవడంతో.. మిగతా నాలుగు పాటలు, నేపథ్యం సంగీతం నేను అందించాను. 

కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయకపోవడానికి కారణం గురించి చెబుతూ, అవకాశమొస్తే ఖచ్చితంగా చేస్తాను. `అధినాయకుడు`, `బాస్` సినిమాలు చేశాను కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అవి సూపర్ హిట్ అయ్యుంటే వరుస అవకాశాలు వచ్చేవి అనుకుంటున్నాను. అవి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నెగటివ్ సెంటిమెంట్ తో కొందరు భయపడి ఉండొచ్చు. 'చెక్' సినిమా తర్వాత కోవిడ్ కారణంగా కాస్త విరామం వచ్చింది. కానీ 2022 ద్వితీయార్థం నుంచి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` మార్చి 17న విడుదలవుతోంది. దాని తర్వాత 'ఇంటింటి రామాయణం', 'విద్య వాసుల అహం' రానున్నాయి. వీటితో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ పరంగా సంతృప్తిగా ఉన్నా` అని చెప్పారు కళ్యాణి మాలిక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్