ఈ సినిమాను పుష్ప తొలిభాగం కంటే కూడా మరింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో గ్రాండియర్, భారీతనం పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘పుష్ప ది రైజ్’ తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. సుకుమార్ దర్శకుడు. రష్మిక (Rashmika) హీరోయిన్ . 2021లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ పోషించిన పాత్రకు అంతటా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ సిద్ధమవుతోంది. పార్ట్ 1కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని పార్ట్2ను మరింత గ్రాండ్‌గా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా పుష్ప 2 సినిమా మ్యూజిక్ డైరక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...
ఈ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ కు పుష్ప2 నిమిత్తం ఎనిమిది కోట్లు (GST మినహాయింపుతో ) ఇచ్చారని తెలుస్తోంది.పుష్ప పార్ట్ 1 దాదాపు నాలుగు కోట్లుదాకా ముట్టిందని, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం, అందులో పాటలు మేజర్ షేర్ ఉండటంతో ఈ సెకండ్ ఇనిస్టాల్మెంట్ కు ఎనిమిది కోట్లు పే చెయ్యటం పెద్ద విషయంగా నిర్మాతలు భావించలేదట. అందులోనూ సుకుమార్ సపోర్ట్ ఉండనే ఉంది. అలాగే పుష్ప 2 కు సుకుమార్, అల్లు అర్జున్ సైతం తమ రెమ్యునరేషన్స్ పెంచేసారు. అలాగే లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. పుష్ప 2నే ఇప్పుడు టాలీవుడ్ లో కాస్టిలీయస్ట్ మూవీ బడ్జెట్ పరంగా అంటున్నారు. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాని 2024, ఆగస్ట్ 15 న రిలీజ్ చేయబోయాలని రిలీజ్ డేట్ ఇప్పటికే ఎనౌన్స్ చేసారు.
ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దేవిశ్రీ, పుష్ప 2 సినిమా కోసం తాను ఆల్రెడీ పాటలు కంపోజ్ చేశానని.. అవి చాలా అద్భుతంగా వచ్చాయని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగంగా కంటే కూడా మ్యూజికల్‌గా రెట్టింపు విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు సుకుమార్ ఈ సినిమా కోసం రాసుకున్న కథ అమోఘంగా ఉందని.. ప్రతిఒక్కరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఆయన అన్నారు.
అలాగే ‘‘ఈ సినిమా కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను నేను ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కానీ, ఒక విషయాన్ని మాత్రం చెప్పగలను. ఎవరూ ఊహించని విధంగా సుకుమార్ దీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదొక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్. ఒక సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్స్ నేను చూశా. ఆ సీక్వెన్స్ గురించి ఎక్కువగా చెప్పను. కాకపోతే అది మాత్రం మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. సినిమాని ఉద్దేశిస్తూ దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక పుష్ప-2 చిత్రంలో బన్నీ మరోసారి ఊరమాస్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.