పిల్లలమర్రి సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు , ఘన స్వాగతం పలికిన ప్రజలు

Published : May 17, 2025, 12:54 PM IST
పిల్లలమర్రి సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ,  ఘన స్వాగతం పలికిన ప్రజలు

సారాంశం

మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శుక్రవారం  సందడి చేశారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అందాల భామల పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలతో పాటు  జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.  


మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం పిల్లలమర్రి ఈ రోజు (శుక్రవారం) మిస్ వరల్డ్ 2024 పోటీదారుల సందర్శనతో రద్దీగా మారింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల భామలకు జిల్లా యంత్రాంగం సంప్రదాయ నృత్యాలతో, ఘనంగా స్వాగతం పలికింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీఎంఆర్, వీర్లపల్లి శంకర్, చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు.

పోటీదారులకు 16వ శతాబ్దానికి చెందిన రాజరాజేశ్వర సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చరిత్రను చరిత్రకారుడు డా. శివ నాగిరెడ్డి వివరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని  విగ్రహాల విశిష్టతను, ఉమ్మడి పాలమూరు జిల్లాలో సేకరించిన పురాతన కళాఖండాల ప్రాముఖ్యతను వివరించారు.

పిల్లలమర్రిలో ఏర్పాటు చేసిన బతుకమ్మలతో, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బతుకమ్మ ఆడుతూ, స్థానిక మహిళలతో కలిసి ఆ ఆనందంగా గడిపారు. అటవీశాఖ అధికారి పిల్లలమర్రి మహావృక్షం చరిత్ర, విశిష్టతను వివరించారు.  అయితే, ఈ సందర్భంగా మిస్ వరల్డ్ చైనా కంటెస్టెంట్ కొద్దిగా డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

ఇదే రోజు సాయంత్రం హైదరాబాద్ శివారులోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ 2024 విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిష్కోవా మరియు అమెరికా, ఓసియానియా ఖండాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు సందర్శించారు. పార్క్ వద్ద వారికి డోలు వాయిద్యం, గజ్జెలతో కూడిన సంప్రదాయ స్వాగతం ఇచ్చారు. పోటీదారులు ఆ ఉత్సాహభరిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

మహబూబ్‌నగర్ జిల్లాలో మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించడమే కాక, రాష్ట్ర పర్యాటక ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసే ఘట్టంగా నిలిచింది. దాంతో అక్కడి ప్రజలు ఈ విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!