
భారీ అంచనాలతో తేజ సజ్జా మిరాయ్
మిరాయ్ చిత్రం అనౌన్స్ అయిన నాటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ మరింతగా పెరిగింది. ఈ ఉత్సాహమే ఇటీవల వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశను ఎదుర్కొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మళ్లీ బలాన్నిచ్చింది. ఈ చిత్రంలో కుర్ర హీరో తేజ సజ్జా, రితిక నాయక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మిరాయ్ అనే ఆయుధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు వైరల్ అవుతున్నాయి.
రిలీజ్ కి ముందే 20 కోట్ల లాభం
60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన మిరాయ్ విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించేలా తీర్చిదిద్దారు. అయితే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లింది. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే నిర్మాతలు దాదాపు 45 కోట్లు వసూలు చేశారు. దీంతో విడుదలకు ముందే 20 కోట్ల టేబుల్ లాభం సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చిన్న విషయమేం కాదు.
ఈ ఏడాది పలు భారీ బడ్జెట్, మిడ్‌రేంజ్ చిత్రాలు కూడా ఖర్చు తిరిగి సాధించడంలో కష్టపడ్డాయి. పాన్-ఇండియా ట్రెండ్ పేరుతో కొందరు అధిక బడ్జెట్ సినిమాలు చేసి నష్టపోయారు. కానీ తేజా సజ్జా మాత్రం తెలివైన నిర్ణయాలతో వాణిజ్యపరంగా లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
కంటెంట్ మాత్రమే కీలకం
థియేట్రికల్ రైట్స్ కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది వారి కంటెంట్‌పై నమ్మకాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ మల్టీ లాంగ్వేజెస్‌లో అద్భుతమైన స్పందన పొందిన తర్వాత ఈ విశ్వాసం మరింత పెరిగింది.
మిరాయ్ చూపిస్తున్నది ఏమిటంటే— పెద్దగా ఖర్చు చేయకుండా, స్టార్ పవర్‌పై ఆధారపడకుండా కూడా ఒక మంచి సినిమాను విజయవంతంగా తీర్చిదిద్దవచ్చని తెలియజేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చు, క్వాలిటీ మధ్య సమతౌల్యాన్ని చక్కగా సాధించింది. ఇది భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు.