
పహల్గాం ఉగ్రదాడి విషాద ఛాయలు భారతదేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఉగ్ర దాడిలో ఏకంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదనరావు అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ నేతలు మధుసూదనరావు ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.
సినీ నటి అనన్య నాగళ్ళ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కావలిలో మధుసూదనరావు నివాసానికి వెళ్లారు. ఉగ్ర దాడిలో మరణించిన మధుసూదనరావు చిత్ర పటానికి మంచు విష్ణు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ధైర్యం చెప్పారు. మధుసూదనరావు ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా మధుసూదనరావు కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సమయం ప్రకటించారు. పర్యాటక ప్రాంతం అయిన పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్ర దాడి జరిగింది. ఈ సంఘటనతో దేశం మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ కి సింధు జలాలని ఆపివేయడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ నటులు ఇండియాలో నటించకుండా బ్యాన్ కూడా విధించారు.
ఇక మంచు విష్ణు విషయానికి వస్తే.. ఆయన కన్నప్ప అనే భక్తి రస చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 27న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీగా 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగ్ర దాడి జరిగిన రోజు మంచు విష్ణు ట్వీట్ చేస్తూ ఉగ్రవాదులు చేసింది పిరికి చర్య అని అభివర్ణించారు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఐక్యతతో ఉండాలని.. ఉగ్రవాదులు మనల్ని విడదీయలేరని మంచు విష్ణు అన్నారు.