
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు(56) శనివారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్‌బాబు తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. రమేష్‌బాబు మరణాన్ని ధృవీకరిస్తూ ఎమోషనల్ నోట్ పంచకుంది ఘట్టమనేని ఫ్యామిలీ.
`మా ప్రియతమ ఘట్టమనేని రమేష్‌బాబు మరణించారని తెలియజేస్తున్నందుకు చాలా చింతిస్తున్నాము. ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచే ఉంటారు. ప్రస్తుతం పరిస్థితుల(కరోనా) దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని కోరుకుంటున్నాం` అని తెలిపారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీకి నెలకొన్నపరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. ఎందుకంటే మహేష్‌బాబు కరోనా సోకి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఇటీవల దుబాయ్ టూర్ వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆయన టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్ అయిపోయారు. వారి ఫ్యామిలీ భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార సైతం ఐసోలేట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్న రమేష్‌బాబు మరణం తీవ్రంగా కలచివేస్తుంది.
అన్న భౌతిక కాయాన్ని చూడలేని పరిస్థితి మహేష్ ఫ్యామిలీది. బయటకు రాలేని పరిస్థితి. కోవిడ్ రూల్స్ ఆయన ఆ పరిసరాల్లోకి కూడా రాలేని పరిస్థితి నెలకొనడం విచారకరం. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు అంటున్నారు ఆయన అభిమానులు, నెటిజన్లు. స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటూ విషెస్ తెలియజేస్తున్నారు. మరి మహేష్ తన అన్నరమేష్‌బాబు భౌతిక కాయాన్ని చివరి చూపుకు నోచుకుంటాడా? లేదా? అన్నది వైద్య అధికారుల నిర్ణయం ప్రకారం ఉండబోతుందని చెప్పొచ్చు.