Ramesh Babu Death: తండ్రి కృష్ణ `అల్లూరి సీతారామరాజు`తో ఎంట్రీ.. బాలనటుడిగా ఫిదా

Published : Jan 08, 2022, 10:35 PM IST
Ramesh Babu Death: తండ్రి కృష్ణ `అల్లూరి సీతారామరాజు`తో ఎంట్రీ.. బాలనటుడిగా ఫిదా

సారాంశం

కృష్ణ పెద్ద కుమారుడు, నటుడు రమేష్‌బాబు కన్నుమూశారు. దీంతో మహేష్‌బాబు కుటుంబ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.కృష్ణ నటించిన ఐకానిక్‌ మూవీ `అల్లూరి సీతారామరాజు` చిత్రంతో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు రమేష్‌బాబు.  

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు, నటుడు రమేష్‌బాబు కన్నుమూశారు. దీంతో మహేష్‌బాబు కుటుంబ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో రమేష్‌బాబు కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. 

రమేష్‌బాబు సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు. కృష్ణ, ఇందిరాదేవిలకు 1965అక్టోబర్‌ 13న చెన్నైలో జన్మించారు. రమేష్‌బాబు తర్వాత మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, మహేష్‌బాబు జన్మించారు. రమేష్‌ బాబు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఇందిరాదేవి రూపులో ఉండే ఆయనకు చిన్నప్పుడు యమ క్రేజ్‌. కృష్ణ నటించిన ఐకానిక్‌ మూవీ `అల్లూరి సీతారామరాజు` చిత్రంతో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు రమేష్‌బాబు.  అప్పటికి ఆయన వయసు కేవలం తొమ్మిదేళ్లు. ఈ సినిమాలో బాల అల్లూరిగా నటించి మెప్పించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. 

ఆ తర్వాత కృష్ణ నటించిన `మనుషులు చేసిన దొంగలు` చిత్రంలో బాలనటుడిగా మెప్పించారు. ఆ తర్వాత `నీడ` సినిమాలో మెప్పించారు. ఇందులో మహేష్‌బాబు కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. వీటితోపాటు `దొంగలకు దొంగ`, `అన్నదమ్ముల సవాల్‌`, `నీలు` చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు.  టీనేజ్‌లోకి వచ్చిన రమేష్‌ బాబు ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తండ్రి కృష్ణ సారథ్యంలో ఆయన హీరోగా ఎంట్రీ జరిగింది. 

1987లో `సామ్రాట్‌` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రమేష్‌బాబు. దీనికి వి మధుసుధన్‌ రావు దర్శకత్వం వహించారు.  తొలి చిత్రంతో ఫర్వాలేదనిపించుకున్నారు రమేష్‌బాబు. ఆ తర్వాత కామెడీ బ్రహ్మాగా పేరు తెచ్చుకున్న జంధ్యాల దర్శకత్వంలో `చిన్ని కృష్ణుడు` చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కోదండరామిరెడ్డి రూపొందించిన `బజార్‌ రౌడీ` చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. హీరోగా ఆయనకు ఇది మంచి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. 

ఆ తర్వాత `కలియుగ కర్ణుడు`, `ముగ్గురు కొడుకులు` చిత్రాలు కృష్ణ దర్శకత్వంలో నటించారు. `ముగ్గురు కొడుకులు` చిత్రంలో కృష్ణ, మహేష్‌లతో కలిసి నటించారు. దాసరి దర్శకత్వంలో `బ్లాక్‌ టైగర్‌`, `వి మధుసుధన్‌ రావు దర్శకత్వంలో `కృష్ణ గారి అబ్బాయి`,తోపాటు `ఆయుధమ్‌`, `కలియుగ అభిమన్యుడు`, `నా ఇల్లే నా స్వర్గం` వంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు రమేష్‌బాబు. వీటితోపాటు `మామ కోడలు`, `అన్నా చెల్లెలు`, `పచ్చతోరణం` సినిమాలు చేశారు. చివరగా ఆయన `ఎన్‌కౌంటర్‌` చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌ చేశారు. 

హీరోగా చేసిన రమేష్‌బాబు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్‌ కాలేదు. వరుసగా పరాజయం చెందాయి. కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయాయి. దీంతో హీరోగా సినిమాలు తగ్గించారు. తాను హీరోగా సెట్‌ కాలేననుకుని ఆయన సపోర్టింగ్‌ రోల్స్ వైపు మొగ్గు చూపారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడం, అదే సమయంలో రమేష్‌బాబు బరువెక్కడంతో ఆయన్ని తెరపై చూడటం కష్టంగా మారింది. దీంతో తనకు తానే సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత ప్రొడక్షన్‌ వైపు మొగ్గు చూపారు. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో