
తెలుగు బుల్లి తెరపై బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 1 చివరి అంకానికి వచ్చింది. ఈ షో ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇతంలా హిట్ అవ్వడానికి కారణం హోస్టుగా వ్యవహరించిన ఎన్టీఆర్ అనడంలో అస్సలు సందేహం లేదు. తన మాటల గారడితో ఇటు అభిమానుల్లోనూ, అటు బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లోనూ వందకు వంద మార్కులు కొట్టేశాడు. టీఆర్పీ రేటింగ్ లు కూడా ఏ షోకి రానంతగా వచ్చాయి. మరో వారంలో షో ముగుస్తుంది కనుక.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని మరింత అద్భుతంగా నిర్వహించాలని యోచిస్తున్నారట.
అంటే ఆ గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ తో పాటు.. మరో స్టార్ ని కూడా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారట. ఇప్పటికే రానా, తాప్సీ, విజయ్ దేవర కొండ, అల్లరి నరేష్, సుమ, సచిన్ లాంటి వాళ్లు సందడి చేశారు. అయితే.. ప్రిన్స్ మహేష్ అయితే.. షోకి మరింత అందం వచ్చే అవకాశం ఉంటుందని ఆయనను సంప్రదించగా.. స్పైడర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాను రాలేనని చెప్పారని టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలీదు.
దీంతో.. మరేం పర్వాలేదు.. వేరే స్టార్లు ఇంకెవరినైనా సంప్రదించమని ఎన్టీఆర్ నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం. తెలుగు టెలివిజన్ రంగంలోనే బిగ్ బాస్ తొలి సీజన్ ముగింపు వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ విజేత ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేట్ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఆదర్శ్, దీక్షా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ వీరిద్దరూ బయటకు వెళితే బిగ్ బాస్ ఫైనల్ వారంలో నవదీప్, శివబాలాజీ, అర్చన, హరితేజా మిగులుతారని అంతా భావిస్తున్నారు. ఈ నలుగురిలో విజేత ఎవరు అనేది ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే నిర్ణయించనున్నారు.
షోలో ఎలిమినేషన్స్ విషయంలో, ఓటింగ్ విషయంలో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, ప్రతి ఓటును ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని, ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతోందని.. ఎన్టీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు.
బిగ్ బాస్ రెండో సీజన్లో పోటీ దారులు మారినా... హోస్ట్ మాత్రం ఎన్టీఆరే కొనసాగుతారని తెలుస్తోంది. ఒక వేళ ఎన్టీఆర్‌ను మారిస్తే సక్సెస్ రేటు, టీఆర్పీ రేటింగులు తగ్గిపోయే అవకాశం ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ నిరంతరాయంగా కొనసాగుతున్నట్లే తెలుగులో ఎన్టీఆర్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది