
లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. ట్రీట్‌మెంట్ అనంతరం కోలుకున్నారు. కరోనా నెగటివ్ వచ్చింది. అయితే చాలా రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగానే ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్‌పై ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హార్ట్ ఎటాక్ రావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఘంటసాల రత్నకుమార్ చిత్ర పరిశ్రమలోనే రాణిస్తున్నారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు(ఘంటసాల), సావిత్రిలకు ఎనిమిది మంది పిల్లలు. వారిటో నలుగురు కూతుళ్లు, నలుగురు కుమారులున్నారు. వారిలో పెద్దకుమారుడు విజయ కుమార్ కాగా, రెండో కుమారుడు రత్నకుమార్. వీరితోపాటు రవికుమార్, శంకర్ కుమారులు చిన్నవాళ్లు. ఘంటసాల భక్తిరసగీతాలు, పౌరాణిక గీతాలు, సినిమా పాటలు ఇలా అన్ని రకాల పాటలు పాడి శ్రోతల మదిలోనిలిచిపోయాడు. ముఖ్యంగా భగవద్గీత ఆలాపణ ఓ హిస్టరీగా నిలిచిపోయింది.
ఇక ఘంటసాల రత్నకుమార్ ఇప్పుడు చాలా ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్టుగానే రాణిస్తున్నారు. ఆయన ఒకేసారి, ఏకకాలంలో ఎనిమిది గంటలపాటు డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ఎక్కారు. ఆయన గతంలో అమేజింగ్ వరల్డ్ రికార్డ్ ని నెలకొల్పారు. తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సృష్టించారు. 1076 తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతం సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. పదివేల తెలుగు, తమిళ సీరియల్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. 50కిపైగా డక్యూమెంటరీలకు వాయిస్ అందించారు.
ఇండస్ట్రీ తనకు ఎంతో ఇచ్చిందని, కొంతైనా తిరిగి ఇవ్వాలనేది ఆయన తాపత్రయం. ఆయన 12 గంటలపాటు నిర్వరామంగా డబ్బింగ్ చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనకు డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా దక్కింది. ఇతర అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఘంటసాల రత్నకుమార్ పట్ల చిత్ర పరిశ్రమ పెద్దలు సంతాపం తెలియజేస్తున్నారు.