
ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని నిలబడిన ఏకైక చిత్రం ‘కిల్’. లక్ష్ లాల్వానీ (Lakshya) హీరోగా, తాన్య మనక్తిలా (Tanya Maniktala) హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్స్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. నిఖిల్ నగేశ్ భట్ దర్శకుడు. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు థియేట్రికల్ రన్ పూర్తయిన 45-60 రోజుల తర్వాతే ఓటీటీలో వచ్చేలా ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు రెండో వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ‘కిల్’ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళంతో సహా పలు భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తోందని తెలుస్తోంది.
మరో ప్రక్క హిందీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన ‘కిల్’ని తెలుగులోకి తేవాలని చాలా మంది దర్శకులు,నిర్మాతలు ఉత్సాహపడుతున్నారు. హీరోలు సైతం రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిత్రం కథేంటంటే..
ఎన్‍ఎస్‍జీ కమాండోగా పని చేస్తున్న అమిత్ రాథోడ్ ( లక్ష్ లాల్వానీ) ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్‍లో బయలుదేరివస్తూంటాడు. అమిత్‍తో పాటు తోటి కమాండో తన స్నేహితుడు వీరేశ్ (అభిషేక్ చౌహాన్) కూడా ఉంటాడు. రాత్రిపూట ప్రయాణం. అమిత్ ఆలోచనల నిండా ఒకటే. తను ప్రేమించిన అమ్మాయి కోటీశ్వరరాలు అయిన తులికా (తాన్య మనక్తిలా)కు వేరే అబ్బాయితో ఎంగేజ్‍మెంట్ చేసేసారు. వాళ్లకు కమెండో గా పనిచేసే అమిత్ ఆనడు. దాంతో ఆమె తల్లితండ్రులు ఇలా వేరే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసేసారన్నమాట. అదే ట్రైన్ లో ఆమె తన ఫ్యామిలీతో ఉంది. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనేది అమిత్ ఆలోచన.
ఇదిలా ఉండగా...ఊహించని విధంగా ఆ ట్రైన్ పై బందిపోట్ల దాడి జరుగుతుంది. ఫణి (రాఘవ్ జుయల్), బేని (ఆశిష్ విద్యార్థి) లీడ్ చేస్తున్న ఓ బందిపోట్ల ముఠా ఆ ట్రైన్ లోని ప్రయాణికులపై దాడి చేస్తుంది. ప్రయాణికులను ఆ బందిపోట్లు దోచుకునేందుకు వస్తారు. ఆ బందిపోట్లు కేవలం దోచుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా తీస్తుంటారు. బయిటకు కాల్స్ వెళ్లకుండా జామర్లు పెట్టి ఎవరి ఫోన్లు పని చేయకుండా చేస్తారు. ఈ క్రమంలో ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణీకుల తో పాటు తులికా కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అప్పుడు అమిత్ రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడు వీరేశ్ సాయింతో కమెండో స్కిల్స్ తో ఆ బందిపోట్లపై సునామీలా విరుచుకుపడతాడు. అప్పుడు ఏం జరిగింది. తులికా ఫ్యామిలీని, ప్రయాణీకులను రక్షించగలిగారా....అనేది మిగతా కథ.