
సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న చిత్రం ‘కిరోసిన్’ (Kerosene). ఈ మూవీని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. నిర్మాతలుగా కొండవీటి దీప్తి, పృద్వీ యాదవ్ వ్యవహరించారు. డైరెక్టర్ ధృవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధృవ, ప్రీతిసింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ, మధుసూదన్ రావు, కాంచెరపాలెం రాజు తదితరులు నటించిన ఈ చిత్రంలో ధృవ, ప్రీతిసింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఈ రోజు (జూన్ 17) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలోని పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
సినిమాలో కథేంటంటే.. ఏపీలోని మారుమూల ప్రాంతమైన జనగూడెంలో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి. మహిళలపై అత్యాచారం, హత్య సంఘటనల దర్యాప్తు పై ఏసీపీ వైభవ్ చాలా సీరియస్ గా పనిచేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తండాలోని రామప్ప (సమ్మెట గాంధీ) కూతురు గౌరీ (లావణ్య చెవుల) అత్యాచారానికి గురవుతుంది. విషయం తెలుసుకున్న ఏసీపీ వైభవ్ (ధృవ) దాని వెనకున్నదుర్మార్గులను గుర్తిస్తాడు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, కేసును దర్యాప్తు చేసిన తీరు, హంతకులకు ఎలాంటి శిక్షను విధించాడనేది మిగితా సినిమాగా ఉంటుంది. కథ సాగిన తీరుకు.. సినిమా టైటిల్ సరిగ్గా సరిపోయిందనే భావన కలుగుతుంది.
సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా రన్ అవుతుంది. అయినప్పటికీ పల్లె వాతావరణం, చిత్ర యూనిట్ ఎంచుకున్న లోకేషన్స్, తారాగణం పర్షార్మెన్స్ కాస్తా కథలోకి లాక్కెళ్తుంది. ధృవ ఎంట్రీతో ఫస్టాప్‌లో వేగం పెరుగుతుంది. గౌరీ కేసు కంటే ముందు మరో హత్య కేసును ఛేదించడం సినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన గౌరీ తండ్రి రామప్పకు అక్కడ ఎదురైన పరిస్థితులను చూపించే సీన్ ద్వారా పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపిస్తారు. గౌరీ కేసు ఏసీపీ చేతిలోకి రావడంతో సినిమా ఊపందుకుంటుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది. సెకండాఫ్ లో గౌరీ కేసు తో ముడిపడి ఉన్న అంశాలపై కథ సాగుతుంది. అయితే ఇప్పటి వరకు సినిమా బాగానే అనిపించినా.. క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుడు ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఏదేమైనా దర్శకుడు మాత్రం సస్పెన్స్ ను మెయింటేన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
సినీ రంగంపై ఉన్న మక్కువతో ఈ సప్సెన్స్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు హీరో, దర్శకుడు ధృవ. ఈ చిత్రంలో హీరోగానే కాకుండా దర్శకత్వం బాధ్యతలు చేపట్టడంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. సహజ సిద్ధమైన పాత్రలు, పల్లె వాతావరణంలో సినిమా చిత్రీకరణ చేయడం బాగుందని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. స్క్రీన్ ప్లేలో కొత్తదనం కనిపిస్తుంది. టెక్నీషియన్స్ కూడా తమ బెస్ట్ అవుట్ పుట్ ను అందించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది.