Dileep: హీరోయిన్ పై దాడి, లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ ఇంట్లో సోదాలు

By Sambi ReddyFirst Published Jan 13, 2022, 4:41 PM IST
Highlights

నటి లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం తో పాటు కొత్త ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. 2017లో దిలీప్ తనపై దాడి చేసినట్లు మలయాళ హీరోయిన్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ అనుభవించిన దిలీప్ బెయిల్ పై బయటికి వచ్చారు.

తాజాగా కేరళలోని ఎర్నాకులంలోని అలువాలో ఉన్న నటుడు దిలీప్ (Dileep) ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. 2017 మలయాళ నటిపై దాడి, లైంగిక వేధింపుల కేసు నిందితుల్లో దిలీప్ ఒకరు. దిలీప్‌ పై దర్శకుడు బాలచంద్రకుమార్ చేసిన తాజా ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కేరళ క్రైమ్ బ్రాంచ్ అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. నేడు గురువారం (జనవరి 13) మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి. కొత్త ఎఫ్‌ఐఆర్ ప్రకారం, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దిలీప్  కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను బెదిరించారని ఆరోపించారు.

గత వారం, దిలీప్, అతని అనుచరులపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపులు దాడి కేసును విచారిస్తున్న  పోలీసు అధికారులపై దాడి చేయడానికి కుట్ర పన్నినట్లు ఆధారాలు లభించాయి. వారి కుట్రకు సంబంధించిన ఆడియో క్లిప్‌లు వెలువడ్డాయి. ఈ కేసులో దిలీప్ ఏ 1 నిందుతుడు కాగా, అతని సోదరుడు అనూప్, బావ సూరజ్ ఏ 2, ఏ 3 లుగా ఉన్నారు.

దిలీప్ తో పాటు ఆయన అనుచరులపై కుట్ర, బెదిరింపు ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఈక్రమంలో నటుడు దిలీప్ సోదరుడు అనూప్ ఇల్లు, షాపులపైన కూడా సోదాలు జరుగుతున్నాయి.2017లో కదులుతున్న కారులో నటిపై దాడికి సంబంధించిన విజువల్స్ నటుడు దిలీప్ వద్ద ఉన్నాయని దర్శకుడు బాలచంద్రకుమార్  ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు బృందం జనవరి 20న దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది.

2017లో నటి లైంగిక వేధింపులు, దాడి కేసు మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేసింది. హీరోయిన్ ని  కిడ్నాప్ చేయడంతో పాటు కదులుతున్న కారులో దాడికి ప్రయత్నించారు. ఐదేళ్లుగా సాగుతున్న ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్ తో మరికొందరిని నిందితులుగా చేర్చారు. ఇటీవల సదరు మలయాళ నటి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు లేఖ రాశారు.అలాగే విచారణను పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మలయాళ నటి తనకు ఎదురైన కష్టాలను బయటపెట్టింది. మోహన్‌లాల్, మమ్ముట్టి మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి చాలా మంది ప్రముఖులు దాడి కేసులో సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతు తెలిపారు. కాగా, దిలీప్ ముందస్తు బెయిల్ దాఖలు చేయగా, జనవరి 14న విచారణ జరగనుంది.
 

click me!